Asianet News TeluguAsianet News Telugu

రేపు చంద్రబాబుతో పవన్ భేటీ.. ఇప్పుడైనా సీట్ల పంచాయితీ తేలేనా ?

టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu), జనసేన (Jana sena) చీఫ్ పవన్ కల్యాణ్ (pawan kalyan) రేపు మరో సారి భేటీ కానున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై మరో సారి చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాగే బీజేపీ (BJP)కి కేటాయించే సీట్లపై కూడా ఓ స్పష్టతకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Pawan Kalyan to meet Chandrababu Naidu tomorrow Is there a seat panchayat now?..ISR
Author
First Published Feb 12, 2024, 2:34 PM IST | Last Updated Feb 12, 2024, 2:40 PM IST

టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకం ఇంకా కొలిక్కి రాలేదు. ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలి ? ఏ పార్టీకి ఎన్ని సీట్లు పంచుకోవాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో సీట్ల పంపకాల అంశం కొలిక్కి రావొచ్చని తెలుస్తోంది.

ఖతార్ నుంచి నేవీ మాజీ అధికారులు విడుదల.. ప్రధాని మోడీపై సోషల్ మీడియాలో ప్రశంసలు

ఇదిలా ఉండగా ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. బీజేపీ పెద్దలతో సమావేశం అయ్యారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీలో చేర్చుకోవాలని, ఏపీలో కలిసి పోటీ చేద్దామని సూచించారు. కానీ ఈ విషయంలో ఆయనకు ఢిల్లీ పెద్దలు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే జనసేన-బీజేపీకి కలిపి మొత్తంగా 50 సీట్లు ఇస్తే కూటమిలో చేర్చుకునే విషయం ఆలోచిస్తామని చెప్పినట్టు సమాచారం. ఏ విషయాన్నీ ఈ నెల 13వ తేదీ (రేపు) వరకు తేల్చాలని డెడ్ లైన్ విధించినట్టు తెలుస్తోంది. 

కాగా.. ఈ నెల 4వ తేదీన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీరి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. అయితే ముఖ్యంగా సీట్ల విషయంలో జరిగిన చర్చ కొలిక్కి రాలేదు. జనసేనకు 28 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత చూపారు. కానీ తమకు 45 సీట్లు కావాలని పవన్ కల్యాణ్ అడిగినట్టు ఆ సమయంలో బయటకు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా ఎటూ తేలలేదు. ఈ సీట్లు సర్థుబాటు అంశం కొలిక్కి రాలేదు.

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగుపాటు.. గ్రౌండ్ లోనే క్రీడాకారుడు మృతి.. వీడియో వైరల్

కానీ జనసేనకు తమకు కలిపి 50 సీట్లు ఇవ్వాలని ఇటీవల ఢిల్లీ టూర్ లో బీజేపీ ప్రపోజల్ పెట్టినట్టు సమాచారం. టీడీపీని కేవలం 120 నుంచి  130 సీట్లకు మాత్రమే పరిమితం చేయాలని బీజేపీ భావిస్తోంది. తమ సపోర్ట్  లేకుండా సింగిల్ గా టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ రాకుండా చేయాలని బీజేపీ-జనసేనలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు పార్టీలు కలిపి 50 సీట్లు  ఇవ్వాలని కోరడంతో చంద్రబాబు నాయుడు ఆలోచనలో పడ్డారు. అందుకే ఆయన కూడా బీజేపీకి తన స్పష్టమైన వైఖరిని తెలియజేయలేదు. 

200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కావాలా ? ఇవి ఉంటే సరిపోతుంది..

అయితే ఒక వేళ బీజేపీ పెట్టిన కండీషన్స్ కు ఒప్పుకుంటే, ఆ పార్టీ నుంచి కొన్ని స్పష్టమైన హామీలు కోరాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందులో ఎన్నికల సమయంలో పోలీసు, ఐటీ సపోర్ట్ సహా కీలక హామీలు ఆయన అడగబోతున్నారని సమాచారం. వీటిపై స్పష్టత ఇవ్వకుండా సీట్ల పంపకాలపై ముందుకు వెళ్లలేమని ఆయన అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో రేపు పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. మరి రేపటి సమావేశంలో సీట్ల సర్దుబాటు అయ్యే విషయం కొలిక్కి వస్తుందో ? రాదో వేచి చూడాల్సి ఉంది. ఈ భేటీ తరువాత మరో సారి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios