అనపర్తి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పర్యటిస్తున్న పవన్ సీఎం చంద్రబాబుకు సిగ్గు శరం లేదని ఘాటుగా విమర్శించారు. 

రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టడానికి కారణమైన కాంగ్రెస్ తోపొత్తుపెట్టుకుంటారా సిగ్గులేదా అంటూ మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆంధ్రావాళ్లను ద్వితీయ శ్రేణివాళ్లుగా పరిగణించడానికి కారణమైన కాంగ్రెస్ తో దోస్తీయా అంటూ మండిపడ్డారు. 

తాను తన అన్నయ్య చిరంజీవిని కాదని టీడీపీకి మద్దతు పలికానని అయితే చంద్రబాబు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని రాహుల్ గాంధీకి తాకట్టుపెట్టారని ఆరోపించారు. అనుభవజ్ఞుడని ప్రజలు అధికారం ఇస్తే ఇలా చేస్తారా అంటూ నిలదీశారు. 

తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతితీవ్ర స్థాయిలో జరగుతుందని ధ్వజమెత్తారు. స్కూటర్ పై వెళ్లే వ్యక్తులు ఎమ్మెల్యే అయ్యాక వందల కోట్లు సంపాదించారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కులాల మధ్య చిచ్చు పెడుతుందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పక్కన మంత్రి నారాయణ ఉండొచ్చు ఇతర కులస్థులు ఉండొచ్చు కానీ ప్రజల్లో మాత్రం కుల విధ్వేషాలు రెచ్చగొడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ పథకాలకు చంద్రబాబు నాయుడు తన పేరును పెట్టుకోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేర్లు, టంగుటూరు ప్రకాశం పంతులు పేర్లు పెట్టొచ్చు కదా అని ప్రశ్నించారు. 

మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ పైనా పవన్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతుంటే నిలదీయాల్సిన జగన్ చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రతీ నియోజకవర్గంలో వెయ్యి కోట్ల మేర అవినీతి జరిగిందన్నారు. వైఎస్ జగన్ తన ఇంటి ఆడపడుచులను తిడతారని వాళ్ల ఇంటి ఆడపడుచులను తాము తిట్టలేమా అని ప్రశ్నించారు. 

జగన్ కు మందీమార్బలం ఉండొచ్చు కానీ తాను భయపడాల్సిన అవసరం లేదన్నారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే తాను భయపడలేదన్నారు. దేశం కోసం ఎంతో మంది జైలుకు వెళ్తే జగన్ లక్షకోట్లు దోచుకుని జైలుకెళ్లారని ధ్వజమెత్తారు. జగన్ జైలుకు వెళ్లింది ప్రజలకోసం కాదని అవినీతి చేసి వెళ్లారన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఓటుతోనే రాజ్యం సిద్ధిస్తోంది:పవన్ కళ్యాణ్

జగన్ పై పవన్ ‘మగతనం’ కామెంట్స్

అప్పుడే మగతనం: జగన్ పై పవన్ వ్యాఖ్య, బాబుపైనా ఫైర్

చిన్నారికి నామకరణం, పవన్ శంకర్ గా పేరుపెట్టిన జనసేనాని