జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు.  ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పర్యటనలో ఉన్న పవన్.. జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. మాట్లాడితే.. తనపై వ్యక్తిగత విమర్శలు చేసే జగన్.. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేకపోయారంటూ జగన్ పై మండిపడ్డారు. 

 ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జగన్ కి ప్రజాస్వామ్యంపై కొంచమైనా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు.  ‘‘ఎలాగూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేకపోయారు. కనీసం బాధ్యత గల ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్లండి. ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేని నేనే ఇన్ని ప్రజా సమస్యలపై పోరాటం చేసి పరిష్కరించగలుగుతున్నప్పుడు.. మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి వెళ్లకుండా పారిపోతే మీరు ప్రజలకు ఏం న్యాయం చేయగలరు. ’’అని పవన్ ప్రశ్నించారు.

‘‘మీరు ఓదార్పు యాత్రలు చేసుకుంటే సరిపోతుందా? ప్రజలు మీకు ఓట్లు వేసింది మీరు అసెంబ్లీకి వెళ్లి నిలబడాలి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నిలదీయాల్సిన బాధ్యత ప్రజలు మీకు ఇచ్చారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు.. అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అప్పుడు మీ మగతనం బయటకు వస్తుంది. మా ఇంటి ఆడపడుచులను తిట్టే ధైర్యం జగన్‌కి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా వాడు ఏం చేస్తాడులే అనుకుంటున్నారా? మీరు ఎంత రెచ్చగొట్టినా సంస్కారంగా మాట్లాడే గుణం మా తల్లి నేర్పింది’ అంటూ  పవన్ జగన్ పై ధ్వజమెత్తారు