రామచంద్రాపురం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను వ్యక్తిగతంగా విమర్శించడం కాదని, అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యలను తూర్పారపడితే అప్పుడు మగతనం బయటకు వస్తుందని ఆయన అన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా తనను విమర్శించడమేమిటని ఆయన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. 
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రిని నిలదీయాల్సిన బాధ్యత ప్రజలు వైసీపీకి ఇచ్చారని, కానీ ప్రతిపక్ష నాయకుడు బుగ్గలు నిమరడం తప్ప ప్రశ్నించడంలేదని అన్నారు. 

రెల్లికులస్థుల భూములను వైసిపి నేత దోచుకున్నా పట్టించుకున్న నాథుడు లేడని తప్పు పట్టారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ కూడా లేని తానే ఇన్ని ప్రజా సమస్యలకు పరిష్కారం కనుక్కుంటున్నానని అంటూ వైసీపీ నేతలు ఏం చేస్తున్నారని ఆయన ప్రషశ్నించారు.

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటడానికి పంచెకట్టు కట్టానని పవన్ కల్యాణ్ తెలిపారు.  హైదరాబాద్‌లో ఆంధ్రులను దోపిడీదారులుగా చిత్రిస్తూ తీవ్రంగా అవమానపరుస్తుంటే ఒక్క ఆంధ్రా నాయకుడు కూడా ప్రశ్నించలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంట్రాక్టుల కోసం, ఇతర ప్రయోజనాలకోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని అన్నారు. 

కుల దూషణలకు పాల్పడుతున్న టీడీపీ నేతలను సహించబోమని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తేడా వస్తే తనలో ఉన్న మరో వ్యక్తిని చూస్తారని  అన్నారు. కులాలను వెనకేసుకొస్తున్న నీచ రాజకీయాలతో తాను విసిగిపోయినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే తమ తరం తెలంగాణాలో అవమానాలు ఎదుర్కొందని అన్నారు.

విశాఖ ఎయిర్‌పోర్టులో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై కూడా ఆయన స్పందించారు. కోడి కత్తులతో హత్యలు చేసే స్థాయికి రాజకీయాలు దిగజారాయని అన్నారు. కాకినాడ పోర్టులో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు.