కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం కాకినాడలో వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన ప్రజలతో పవన్ సమావేశమయ్యారు. వారి సమస్యలను తెలుసుకుంటూ, భవిష్యత్ లో జనసేన అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 

అందులో భాగంగా జిల్లాలోని రెల్లి కాలనీలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారికి పవన్ నామకరణం చేశారు. ఆ బాబుకు పవన్ శంకర్ అని పేరుపెట్టారు. రెల్లి సామాజికవర్గానికి జనసేన అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు. 

ఇటీవలే పవన్ కళ్యాణ్ తాను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అంతా మతాలను స్వీకరిస్తారు కానీ తాను మాత్రం రెల్లి కులాన్ని స్వీకరిస్తానన్నారు. రెల్లి సామాజికవర్గం ఎంతో ఉత్తమమైనదంటూ అభివర్ణించారు. సమాజంలో చెత్తను ఎలా ఏరివేస్తారో రాజకీయాల్లో చెత్తను జనసేన కూడా ఏరివేస్తుందన్నారు.