తిరుపతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఇంటి దొంగల పనేనని ఆయన సన్నిహితుడు పరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి కోసం ప్రాణం ఇచ్చేవాడినే కానీ, ప్రాణం తీసేవాడిని కాదని ఆయన వివరణ ఇచ్చారు.

సోమవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. ఇంట్లో వారి హస్తం లేనిదే వివేకా హత్య జరగదని ఆయన అభిప్రాయపడ్డారు.తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరమేశ్వర్ రెడ్డి  చికిత్స పొందుతున్నాడు. వివేకానందరెడ్డి రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేకనే ఈ హత్య చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

జగన్ సీఎం అయితే వివేకానందరెడ్డి రాజకీయంగా మరింత బలపడేవాడన్నారు. కడప ఎంపీగా వైఎస్ విజయమ్మ, షర్మిల పోటీ చేయాలనే ప్రతిపాదనను కొందరు తప్పుబట్టినట్టుగా వివేకానందరెడ్డి తనకు చెప్పారని ఆయన గుర్తు చేసుకొన్నారు.

కొన ఊపిరితో ఉన్న సమయంలోనే వైఎస్ వివేకానందరెడ్డితో లేఖ రాయించి ఉంటారని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. డ్రైవర్ ప్రసాద్ చాలా మంచివాడని పరమేశ్వర్ రెడ్డి చెప్పారు. ఇంట్లో ఉండే వివేకాను హత్య చేసి ఉంటారని ఆయన ఆరోపించారు. 

వైఎస్ వివేకానందరెడ్డిని కడప ఎంపీగా పోటీ చేయాలని వైఎస్ షర్మిల కోరిందన్నారు. అయితే తాను పోటీకి సిద్దంగా లేనని షర్మిల కానీ, విజయమ్మ కానీ పోటీ చేయాలని వివేకానందరెడ్డి సూచించినట్టుగా  ఆయన గుర్తు చేసుకొన్నారు.

వైఎస్ షర్మిల, విజయమ్మ  ఎంపీగా పోటీ చేయడంలో తప్పేమీ ఉందని వివేకా తనతో అన్నారని చెప్పారు.  జగన్ సీఎం అయితే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని కూడ ఆయన కొందరి వద్ద వ్యాఖ్యానించినట్టు చెప్పారు.

వివేకానందరెడ్డిని హత్య చేసేందుకు పకడ్బందీగా ప్లాన్ చేశారని చెప్పారు. ఇంటి తలుపులు  పగులగొట్టే సమయంలో  మాకు ఫోన్ చేసి ఉండే అవకాశం ఉంది,  మరో వైపు తన వద్ద కూడ లైసెన్స్‌డ్ గన్ కూడ ఉందని ఆయన గుర్తు చేసుకొన్నారు. తలుపులను ముందుగానే తెరిచిపెట్టి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. పీఏ, గంగిరెడ్డితో పాటు తాను ఎవరినీ కూడ నమ్మనని పరమేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

ప్రాణాలిచ్చేవాడినే కానీ, తీసేవాడిని కాదు: వైఎస్ వివేకా హత్యపై పరమేశ్వర్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య: అదృశ్యం కాలేదన్న పరమేశ్వర్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య: పరమేశ్వర్ రెడ్డి కోసం సిట్ గాలింపు