తిరుపతి: ప్రాణాలిచ్చేవాడినే కానీ, ప్రాణాలు తీసేవాడిని కాదని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సన్నిహితుడు పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

 పరమేశ్వర్ రెడ్డి తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.సోమవారం నాడు  ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు నుండి పరమేశ్వర్ రెడ్డి కన్పించకుండా పోయాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వైఎస్ వివేకానందరెడ్డితో తనకు 20 ఏళ్లుగా  సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం కోసం ప్రాణాలు ఇచ్చేవాడిని తప్ప... ప్రాణాలు తీసేవాడిని కాదన్నారు.

రాజకీయంగా తన కుటుంబాన్ని దెబ్బతీసేందుకు కుట్రపన్నారని ఆయన ఆరోపించారు. 30 ఏళ్లుగా కాపాడుకొంటూ వచ్చిన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు  కొందరు పనిగట్టుకొని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పరమేశ్వర్ రెడ్డి చెప్పారు.

పోలీసుల అసమర్ధత వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల్లో తమ కుటుంబాన్ని అవమానపర్చేలా చేస్తున్నారని ఆయన  ఆరోపించారు.

20 ఏళ్లుగా తనతో వైఎస్ వివేకాతో పరిచయం ఉందన్నారు. తనను కొడుకు మాదిరిగా  వివేకా చూసుకొన్నాడని, తాను కూడ అతడిని తండ్రి మాదిరిగా చూసుకొన్నానని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే తనకు వివేకా చనిపోయాడనే విషయం తెలిసిందన్నారు. అయితే మంచం కూడ దిగే పరిస్థితిలో లేనందను తాను వివేకా మృతదేహాన్ని కూడ చూడలేదన్నారు. కానీ, వివేకానంద రెడ్డి మృతదేహాన్ని చూసేందుకు తన భార్యను పంపించినట్టుగా ఆయన వివరించారు.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్య: అదృశ్యం కాలేదన్న పరమేశ్వర్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య: పరమేశ్వర్ రెడ్డి కోసం సిట్ గాలింపు