విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జరిగిన బిటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నాగేంద్రనే ఆమెను పథకం ప్రకారం హత్య చేసినట్లు గుర్తించారు. దివ్య తేజస్వితో దిగిన ఫొటో నిజం కాదని, అది మార్ఫింగ్ ఫొటో అని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. 

అప్పుడే నిద్ర లేచిన దివ్య తేజస్వి గదిలోకి చాకచక్యంగా ప్రవేశించి ఆమెపై నాగేంద్ర దాడి చేశాడని పోలీసులు భావిస్తున్నారు. తామిద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నామని అంటూ నాగేంద్ర ఓ వీడియోను లీక్ చేశాడు. తమకు వివాహమైనట్లు కూడా ఓ ఫొటోను బయటపెట్టాడు. అయితే, ఆ రెండు విషయాలను దివ్య కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. 

Also Read: ఆత్మహత్యకు 13 కత్తిపోట్లా: దివ్య కుటుంబాన్ని పరామర్శించిన సుచరిత

తాజాగా పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. విజయవాడలోని క్రీస్తురాజపురంలోని తన ఇంట్లో దివ్య తేజస్విని ఈ నెల 15వ తేదీన హత్యకు గురైన విషయం తెలిసిందే. అదే సమయంలో గదిలో బుడిగ నాగేంద్ర అలియాస్ చిన్నస్వామి రక్తం మడుగులో పడి ఉన్నాడు. 

ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో దివ్యను ఆమె తల్లి కుసుమ టిఫిన్ చేయడం కోసం లేపింది. అయితే, కాసేపటి తర్వాత చేస్తానని చెప్పి దివ్య నిద్రలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత వలంటీర్ రావడంతో కుసుమ కిందికి వెళ్లింది. అప్పటికే నాగేంద్ర వెనుక వైపు నుంచి దివ్య గదిలోకి ప్రవేశించి లోపలి నుంచి గడియ పెట్టాడు. పక్క గదికి కూడా గడియ వేశాడు. 

కుసుమ తిరిగి మేడకు వెళ్లి చూడగా బయట అబ్బాయి చెప్పులు కనిపించాయి. అనుమానం వచ్చి తలుపు కొట్టింది. కానీ తలుపు ఎంతకీ తెరుచుకోలేదు. దీంతో ఆమె పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవాళ్లు వచ్చారు. తలుపు పగులగొట్టి చూడగా దివ్య రక్తం మడుగులో కనిపించింది. నాగేంద్ర చిన్నచిన్న గాయాలతో ఓ మూలన పడి ఉన్నాడు. 

Also Read: దివ్య శరీరంపై 13 కత్తిపోట్లు: జోసెఫ్, హత్య కేసులో మరో ట్విస్ట్

ఆటోలో ఆస్పత్రికి తరలించే సమయంలో నాగేంద్ర గొంతుపై గాయం చేసుకున్నాడు. దివ్య ఉన్న గదిలో ఫ్యాన్ కు బెడ్ షీట్ వేలాడుతూ కనిపించింది. ఇదంతా పరిశీలిస్తే దివ్యను చంపాలనే ఉద్దేశంతోనే నాగేంద్ర వచ్చినట్లు అర్థమవుతుందని అంటున్నారు.  నాగేంద్ర స్టీల్ చాకుతో దివ్య మెడపై తొలుత పొడిచి, శరీరంపై ఇష్టానుసారం పొడిచినట్లు అనుమానిస్తున్నారు. దివ్య శరీరంపై 13 కత్తిగాట్లు ఉన్న విషయాన్ని ఆమె తండ్రి జోసెఫ్ తెలిపిన విషయం తెలిసిందే. 

ఆ తర్వాత కట్టుకథలు అల్లి వీడియోలను, ఫొటోలను నాగేంద్ర వదిలినట్లు భావిస్తున్నారు. దివ్య సెల్ఫీ వీడియోలో వ్యక్తం చేసిన ఆవేదన యావత్తూ నాగేంద్ర గురించేనని భావిస్తున్నారు. తనకు దివ్య దూరమైన తర్వాత ఆమె స్నేహితురాళ్లను వాడుకుని నకిలీ ఖాతా సృష్టించి వేధింపులు సాగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దివ్య ఫోన్ ను విశ్లేషిస్తున్న సైబర్ క్రైమ్ విభాగం నిపుణులు ఇన్ స్టాగ్రామ్ ఖాతలో ఆమె యాక్సెస్ ఉన్న వాళ్ల జాబితాను తయారు చేస్తున్నట్లు సమాచారం. దాని ఆధారంగా వారిని విచారించే అవకాశం ఉంది.