ప్రేమోన్మాది చేతిలో దారుణహత్యకు గురైన విజయవాడ దివ్య కుటుంబాన్ని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమలతో మాట్లాడి ఓదార్చారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు సుచరిత.

ఈ క్రమంలో నిందితుడు నాగేంద్రపై చర్యలు తీసుకోవాలని దివ్య తల్లిదండ్రులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం సుచరిత మాట్లాడుతూ... ఎన్ని చట్టాలు చేసినా నేరాలు జరుగుతుండటం బాధాకరమన్నారు.

ఆత్మహత్యకు 13 కత్తిపోట్లు వున్న దాఖలాలు లేవని సుచరిత అన్నారు. తెలిసీ తెలియని వయసులో దిగిన ఫోటోలు ఇప్పుడు బయటపెట్టారని, చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని హోంమంత్రి సూచించారు. ఇదే సమయంలో దివ్య హత్యకు గురైన ప్రాంతాన్ని విజయవాడ సీపీ శ్రీనివాసులు పరిశీలించారు. 

దివ్య హత్య కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. నాగేంద్ర, దివ్యల వివాహం రికార్డు కాలేదని పోలీసులు చెబుతున్నారు. వారిద్దరు 2018 మార్చిలో మంగళగిరి గుడిలో తాళి కట్టుకుని దండలు మార్చుకున్న ఫొటో మాత్రం ఉందని వారు గుర్తించారు. ఈ విషయంలో నాగేంద్రకు సహకరించిన మహిళ కూపీ లాగుతున్నారు. ఇందుకు పోలీసులు విష్ణు కాలేజీకి వెళ్లారు.

Also Read:దివ్య శరీరంపై 13 కత్తిపోట్లు: జోసెఫ్, హత్య కేసులో మరో ట్విస్ట్

విజయవాడలో దివ్య అనే యువతిని నాగేంద్ర బాబు అత్యంత క్రూరంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నాగేంద్ర కూడా కత్తితో తనకు తాను గాయాలు చేసుకుని ప్రస్తుతం అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

దివ్య హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే విధంగా నాగేంద్రబాబు వాంగ్మూలం నేపథ్యంలో దివ్య తల్లిదండ్రులను మాచవరం పోలీసు స్టేషన్ లో విచారించారు. 

నాగేంద్రకు దివ్య చివరిసారిగా మార్చి 28వ తేదీన ఫోన్ చేసింది. నాగేంద్ర ఏప్రిల్ 2వ తేదీన చివరిసారిగా దివ్యకు ఫోన్ చేశాడు. కేసును బెజవాడ పోలీసు స్టేషన్ నుంచి దిశ పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు.

కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని దివ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాగేంద్రను ఎన్ కౌంటర్ చేయాలని లేదా ఉరి తీయాలని దివ్య తండ్రి జోసెఫ్ డిమాండ్ చేశారు.

Also Read:దివ్య ఇన్‌స్టా వీడియోలో సంచలనం: రెండున్నర ఏళ్లుగా రిలేషన్‌షిప్, అతనో సైకో

తను కూతురిని అత్యంత కిరాతకంగా నాగేంద్ర హత్య చేశాడని, దివ్య శరీరంపై 13 కత్తిగాట్లు ఉన్నాయంటే ఎంత క్రూరంగా హత్య చేశాడో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

దివ్యను పథకం ప్రకారం హత్య చేశాడని, తాను చిన్న చిన్న గాయాలు మాత్రమే చేసుకున్నాడని ఆయన అంటున్నారు. హత్యానేరం నుంచి బయటపడానికి నాగేంద్ర ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు.