Asianet News TeluguAsianet News Telugu

కోర్టు ధిక్కరణ... సుప్రీంకోర్టు మెట్లెక్కాల్సి వస్తుంది జాగ్రత్త: సీఎం జగన్ కు రఘురామ హెచ్చరిక

ఐటీ చట్టం (66)సెక్షన్, పోలీస్ కేసులను తప్పుబడుతూ సీఎం జగన్ కు నవ సూచనల పేరిట మరో లేఖను సంధించారు వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.  

MP Raghurama Krishnaraju Writes another Letter to CM YS Jagan akp
Author
Amaravati, First Published Jul 7, 2021, 12:21 PM IST

న్యూడిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా బుధవారం మరో లేఖ రాశారు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలిపిన వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడంపై మండిపడ్డారు. ఐటీ చట్టం (66)సెక్షన్, పోలీస్ కేసులను తప్పుబడుతూ నవ సూచనల పేరిట మరో లేఖను సంధించారు ఎంపీ రఘురామ. 

సీఎం జగన్ కు రఘురామ రాసిన లేఖ యధావిధిగా:   

జులై 7, 2021
శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి,
ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

విషయం: ఐటి చట్టం సెక్షన్ 66 - పోలీసు కేసులు

సూచిక: నవ సూచనలు (వినమ్రతతో) లేఖ 9

ముఖ్యమంత్రి గారూ,
మన రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపైన మన ప్రభుత్వం ఐటి చట్టం 66(ఏ) సెక్షన్ ప్రకారం విచ్చలవిడిగా తప్పుడు కేసులు బనాయిస్తున్నట్లు పౌర సమాజం, మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. సుప్రీంకోర్టు 2015 లోనే ఐటి చట్టంలోని 66(ఏ) సెక్షన్ ను కొట్టేసినా కూడా పోలీసులు అదే సెక్షన్ కింద కేసులు నమోదు చేయడంపై ఇటీవల సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. 2021 మార్చిలో యథాలాపంగా తీసిన లెక్కలలో కూడా తెలిసింది ఏమిటంటే ఈ సెక్షన్ కింద నమోదు చేసిన కేసులలో ఇంకా దర్యాప్తు వేగవంతంగా నిర్వహిస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు కొట్టేసిన 6 సంవత్సరాల తర్వాత కూడా అదే సెక్షన్ కింద కేసులు అలానే ఉంచి దర్యాప్తు చేయడం అంటే అది మన కార్యనిర్వాహక వ్యవస్థ పనితీరుపై మాయని మచ్చగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా కు సంబంధించి నమోదు అయిన కేసుల తీరు పరిశీలిస్తే అవేవీ కూడా సరైన కేసులు కాదు. తప్పుగా అర్ధం చేసుకుని కావాలని పెట్టిన తప్పుడు కేసులేనని ఇప్పటికే పలు మీడియాలో వార్తలు వచ్చాయి. ఉదాహరణకు తీసుకుంటే నలంద కిషోర్ అనే వ్యక్తిని ఇలాంటి కేసులోనే అరెస్టు చేసి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయించి ఒక పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడ అతడిని తీవ్రమైన మానసిక వత్తిడికి గురి చేశారు. అంతే కాదు పోలీసులు అతడిని శారీరకంగా హింసించారు. దరిమిలా అతని ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఆ తర్వాత సులభంగా కరోనా సోకి చివరకు అతను అర్ధంతరంగా మరణించాడు. 

అదే విధంగా 66 సంవత్సరాల వయసు ఉన్న శ్రీమతి పునుతోట రంగనాయకమ్మ కేసు విషయం కూడా చెప్పుకోవచ్చు. ఆమె కూడా తనకు ఎక్కడి నుంచో వచ్చిన ఒక మెసేజీని తన స్నేహితులకు ఫార్వర్డ్ చేశారు. ఇలాంటి కేసుల్లో అవసరం లేకపోయినా కూడా పోలీసులు 505, 120 బి సెక్షన్ లను అక్రమంగా రుద్దుతున్నారు. సెక్షన్ 505 ను హింస రెచ్చగొట్టే తీవ్రమైన కేసుల్లో ప్రయోగించాలి కానీ సాధారణమైన సోషల్ మీడియా కేసుల్లో కూడా అదే సెక్షన్  ను పోలీసులు కక్షపూరితంగా నమోదు చేస్తున్నారు. ఇలా అన్యాయంగా కేసులు నమోదు చేసే చట్ట విరుద్ధ చర్యలను తక్షణమే నిలుపుదల చేయకపోతే ఇక భరించే శక్తి లేని ప్రజలు మన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. పోలీసులు చేత చేయించే అకృత్యాలను ప్రజలు భరించేందుకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా. మన పోలీసులు ఇక నుంచి అయినా కేసుల నమోదుపై తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, ఐటి చట్టం సెక్షన్ 66 (ఏ) కి సంబంధించి కోర్టు ధిక్కరణ చర్యగా భావించి సుప్రీంకోర్టు, తనంత తానుగా (సుమోటో) కేసు స్వీకరించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా చెప్పాల్సిన సామెత ఏమిటంటే ‘‘అడుసు తొక్కనేల కాలు కడగనేల’’.

మహిళ పట్ల నిర్దిష్టమైన నేరాలు చేసే వారికి మరణ శిక్ష విధించేందుకు చట్టాన్ని సవరించాలని నిర్ణయించిన తొలి రాష్ట్రం మనది. అంతే కాకుండా సంబంధిత కేసును 21 రోజుల్లో పరిష్కరించాలని, నిందితులకు మరణ శిక్ష పడేలా చేయాలని కూడా చెబుతూ మనం దిశ చట్టం తీసుకువచ్చాం. అయితే దీనికి ఇంకా కేంద్రం నుంచి అనుమతి రాకపోయినా సరే మనం 18 దిశ పోలీసు స్టేషన్లను ప్రారంభించేశాం. అంతే కాకుండా దిశ యాప్ ను కూడా మొదలు పెట్టేశాం. కేంద్రం నుంచి అనుమతి రాకుండా కూడా మనం ఇన్ని పనులు చేసేస్తున్నామంటేనే మన రాష్ట్రంలోని పోలీసు శాఖ ఏ విధంగా ఉందనే విషయం స్పష్టం అవుతున్నది. దిశ యాప్ లాంటి సాంకేతిక అంశాలు ప్రవేశ పెట్టడం ప్రశంసనీయమే అయినా తద్వారా వచ్చే ఫిర్యాదులను దిశ చట్టం కింద నమోదు చేస్తేనే చిక్కులు వస్తాయి. ఎందుకంటే మన రాజ్యాంగం నిర్దేశించిన ఫెడరల్ వ్యవస్థ ప్రకారం మీరు తీసుకువచ్చిన దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదించలేదు కాబట్టి. 

తాడేపల్లిలోని మీ నివాసానికి కూత వేటు దూరంలో ఇటీవల ఒక ఘోరమైన నేరం జరిగింది. ఆ నేరంలో ఇప్పటి వరకూ నిందితుడిని పట్టుకోలేకపోయారు. మీరు ఎంతో కోరికతో చట్టం రూపొందించినా, నిర్ణీత కాలవ్యవధిలో కేసులు పరిష్కారం అయిపోవాలని చెప్పినా ఈ కేసులో ఫలితం శూన్యం. అందువల్ల సారాంశం ఏమిటంటే మీరు పరిస్థితి గంభీరత అర్ధం చేసుకుంటే సరిపోదు. దాన్ని ఏ విధంగా చట్టబద్ధమైన రీతిలో పరిష్కరించాలి అనే అంశంపై కూడా పూర్తి అవగాహనతో చట్టాలను రూపొందించాలి. కేసులను న్యాయస్థానం వరకూ తీసుకువెళ్లడంలో మీరు సమయాన్ని నిర్దేశించడం వరకూ ఫర్వాలేదు కానీ న్యాయస్థానాలు కూడా మీరు నిర్దేశించిన సమయంలోనే నిర్ణయాలు తీసుకోవాలని కోరుకోవడం నెరవేరే అంశం కాదు. పైగా కేంద్రం కూడా ఆమోదముద్ర వేయని చట్టంపై నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? న్యాయ నిర్ణయంలో కాలహరణం జరగడం అన్యాయమనే వాదన ఉన్నా చాలా సందర్భాలలో దశాబ్దాల పాటు నడిచిన కేసులను కూడా మనం చూస్తున్నాం.

నా పార్లమెంటు నియోజకవర్గంలోనూ, రాష్ట్రంలోని మరి కొన్ని చోట్ల కూడా జరుగుతున్న కొన్ని సంఘటనలను తలచుకుంటే బాధేస్తున్నది. ఎవరైనా సరే నా ఫొటోను వారి ఫోన్ లో డిస్ ప్లే చేసినా, మెసేజింగ్ యాప్ లలో వాడుకున్నా వారిని పోలీసు స్టేషన్ కు పిలుస్తున్నారు. తక్షణమే వారి ఫోన్ లు, యాప్ ల నుంచి నా ఫొటోను తీసేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కంటికి కనపడని  డీఫాక్టో హో మంత్రి గా ఉండే వ్యక్తి చెప్పినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మీరు ఎంతో శక్తిని ఉపయోగించి వారి సెల్ ఫోన్ లలో నా ఫొటోను తీసేయించవచ్చు గానీ వారి హృదయాలలో చెరగని నా ముద్రను మాత్రం తీసేయలేరు. ఎందుకంటే దాన్ని పోలీసులు చూడలేరు కాబట్టి. ప్రజల హృదయంలో ఉన్న నా ఫొటోను పోలీసులు చూడగలిగితే దాన్ని కూడా తీసేయించే ప్రయత్నం చేసేవారు. ఇలాంటి చాలా సందర్భాలలో బాధిత ప్రజలు న్యాయస్థానాలకు వెళ్లడం లేదు కాబట్టి పోలీసులు యధేచ్ఛగా అదృశ్య శక్తి ఆదేశాలు అమలు చేస్తున్నారు కానీ ఎవరైనా కోర్టుకు వెళ్లి ఉంటే వారి ఆటలు సాగేవి కాదు.

పైన చెప్పిన అన్ని విషయాలను క్రోడీకరిస్తే తేలేది ఏమిటంటే మన రాష్ట్రంలో పోలీసులు తమ ఇష్టానుసారం వీలున్న సెక్షన్లను బనాయించి కేసులు పెడతారు తప్ప దేశంలో అమలు జరుగుతున్న చట్టం, న్యాయం పట్టించుకోరు. అందువల్ల నేను కోరుతున్నది ఏమిటంటే మీరు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డిజిపిని పిలిచి వస్తునన విమర్శలను సానుకూల దృక్పథంతో చూడాలని ఆదేశించండి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం పై వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారనే దృష్టితోనే ఆలోచించి సెక్షన్ 505 కింద కేసులు పెట్టడం కాకుండా అవి పాలనలోని లోపాలను సరిదిద్దేందుకు చేసే సహేతుక విమర్శలుగా తీసుకోవాలని చెప్పండి. అది సరైన పరిపాలన అవుతుంది. అదే విధంగా సుప్రీంకోర్టు ఇప్పటికే రద్దు చేసిన ఐటి చట్టంలోని 66 (ఏ) కింద నమోదు చేసిన కేసులను కూడా తక్షణమే ఉపసంహరించుకోమని కూడా చెప్పండి.

భవదీయుడు,
కె.రఘురామకృష్ణంరాజు.

Follow Us:
Download App:
  • android
  • ios