విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే... శనివారం మధ్యాహ్నం బ్యారేజ్ గేట్ల మధ్యలో ఇరుక్కున్న నాటు పడవను తొలగించే పనుల్లో సిబ్బంది తలమునకలై ఉన్నారు.

ఈ పనులను జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌లు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో ఓ వృద్ధుడు కృష్ణవేణి ఘాట్ సమీపంలో నీటిలో కొట్టుకుపోతూ కనిపించాడు.

దీంతో మంత్రి సిబ్బందికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. బ్యారేజ్ ఆప్రాన్ నుంచి పడవపై వెళ్లిన పోలీసులు, మత్స్యకారులు.. ఆ వ్యక్తిని సీతమ్మవారిపాదాల సమీపంలో రక్షించి ఒడ్డుకు చేరుస్తున్న క్రమంలో కొద్దిసేపటికే మృతి చెందారు.

మృతుడిని బావాజీపేట నాలుగో లైనుకు చెందిన మజ్జి అప్పన్నగా గుర్తించారు. ఇతను ఘాట్‌కు దగ్గరలో ఉన్న శనీశ్వరుని ఆలయానికి వచ్చాడు. స్నానం చేయడానికి దిగి ప్రవాహంలో కొట్టుకుపోయారని పోలీసులు భావిస్తున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వృద్ధుడు మరణించాడని స్థానికులు మండిపడుతున్నారు.

బ్యారేజ్ వద్దకు కొట్టుకు వచ్చిన పడవను తొలగించే పనుల్లో భాగంగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఐదు గేట్లను ఎత్తివేయడంతో నీరు అధికంగా దిగువకు ప్రవహించిందని.. అదే సమయంలో సీతమ్మవారిపాదాల సమీపంలో స్నానం చేస్తున్న వృద్ధుడు కొట్టుకుపోయాడని స్థానికులు చెబుతున్నారు. 

పోటెత్తిన వరద: లంక గ్రామాలకు ముప్పు, పునరావాస కేంద్రాలు

హోం మంత్రి ఏం చేస్తారు?: చెవిటికల్లు గ్రామస్తులపై ఎమ్మెల్యే ఆగ్రహం

కృష్ణమ్మ ఉగ్రరూపం, నాటు పడవ బోల్తా: 11ఏళ్ల బాలిక గల్లంతు

పోటెత్తిన వరద: లంక గ్రామాల్లోకి నీరు, అప్రమత్తమైన సర్కార్