అనంతపురం: మార్కెట్లోకి కియా  మోటార్స్ తయారు చేసిన కారును గురువారం నాడు  ఆ సంస్థ విడుదల చేసింది. కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతులు, రాయితీలు, సౌకర్యాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం కల్పించింది. కానీ, గురువారం నాడు మార్కెట్లోకి కారును విడుదల చేసిన సమయంలో కియా మోటార్స్ సీఈఓ చంద్రబాబు ఊసెత్తలేదు. 

కరువు కోరల్లో చిక్కుకొన్న అనంతపురం జిల్లాలో  పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధిని కల్పించేందుకుగాను  ఆనాడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం కియా పరిశ్రమను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయించింది. ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి అవసరమైన మౌళిక వసతులతో పాటు రాయితీలను కూడ చంద్రబాబునాయుడు సర్కార్ కల్పించింది.

కియా మోటార్స్ కు అవసరమైన నీటిని హెచ్‌ఎన్‌ఎస్ఎస్ ద్వారా కూడ చంద్రబాబునాయుడు  ప్రభుత్వం కల్పించింది. 

గురువారం నాడు  కియా మోటార్స్ అనంతపురం యూనిట్ మొదటి కారును మార్కెట్లోకి  విడుదల చేసింది. ఈ సందర్భంగా కియా మోటార్స్  ఎండి, సీఈఓ కుక్యూయన్ షిమ్ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చాడు. 

రెండేళ్ల క్రితం ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం చంద్రబాబునాయుడు తీవ్రంగా కృషి చేశారు.ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం అవసరమైన భూమిని సేకరించేందుకు గాను చంద్రబాబు సర్కార్ వేగంగా పూర్తి చేసింది.

ఈ ఏడాది జనవరి 29వ తేదీన కియా కార్ల ఫ్యాక్టరీ నుండి  ట్రయల్ పద్దతిలో కారును లాంచ్ చేశారు. ఈ సమయంలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం అందించిన మద్దతు, ప్రోత్సాహకాలను కియా సీఈఓ గుర్తు చేశారు. కానీ, గురువారం నాడు మాత్రం చంద్రబాబు  పేరు ఎత్తలేదు.

ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో చంద్రబాబు పేరు ఎత్తని కియా సీఈఓ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు ఎత్తాడు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటులో మోడీ సహకరించాడని  ఆయన ప్రకటించడం విశేషం.

ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొనలేదు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం జగన్ సందేశాన్ని చదివి విన్పించారు.

దశాబ్దం క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కియా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఆహ్వానించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఏపీ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ కల సాకారమైందన్నారు.

ఏపీ రాష్ట్రంలో  పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యలను కల్పిస్తోందని మంత్రులు చెబుతున్నారు.అనంతపురం జిల్లాలో కియా ఫ్యాక్టరీ ఏర్పాటును తమ క్రెడిట్‌గా వైఎస్ఆర్‌సీపీ చెప్పుకోవడాన్ని టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పార్ధసారధి తప్పుబట్టారు. 

కియా ఫ్యాక్టరీ ఏర్పాటులో  చంద్రబాబునాయుడు కృషి ఉందని ఆయన చెప్పారు. కియా  ఫ్యాక్టరీ లో ఉత్పత్తైన కారు  మార్కెట్లోకి విడుదల కావడంతో  కొందరు టీడీపీ నేతలు గురువారం నాడు పాలాభిషేకం చేశారు.
 

సంబంధిత వార్తలు

మార్కెట్లోకి కియా కారు.. తొలి కారును విడుదల చేసిన బుగ్గన

కియోది ఇక ఫుల్ స్పీడ్.. అనంత ప్లాంట్‌లో నేడే ‘సెల్టోస్’ ప్రొడక్షన్

సీఎం జగన్ ను కలిసిన కియా కంపెనీ ప్రతినిధులు : కొత్తకారు విడుదల చేయాలని ఆహ్వానం

తెలుగు రాష్ట్రాల విపణిలోకి కియా ‘సెల్టోస్‌’.. భాగ్యనగరిలో 3 షోరూమ్‌లు

వైసీపీ అబద్దాలకు ఇదే పరాకాష్ట: కియాపై బాబు కామెంట్స్

కియా కారుపై చంద్రబాబు స్వారీ (ఫొటోలు)

పెనుకొండలో కియా మోటార్స్ తొలి కారును విడుదల చేసిన బాబు

త్వరలో రోడ్లపైకి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ కార్