ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన కియా మోటార్స్ కంపెనీ నుంచి తొలి కారు మార్కెట్లోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి వద్ద కియా ప్లాంట్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కియా మోటార్స్‌కు చెందిన సెల్టోస్ కారును విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రి శంకర్ నారాయణ, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. వైఎస్ ఆలోచనలకు కార్యరూపమే కియా పరిశ్రమని అభివర్ణించారు.

రాయలసీమలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు మరింత ప్రోత్సహకాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టీసీకి విద్యుత్ బస్సులను కొనుగోలు చేస్తామని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.