అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కియా కంపెనీ యాజమాన్యం కలిసింది. జెరూసలేం పర్యటన ముంగించుకుని అమరావతి చేరుకున్న వైయస్ జగన్ ను మధ్యాహ్నాం కియా కంపెనీ ప్రతినిధులు కలిశారు. 

ఈనెల 8న మధ్యాహ్నం అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటులో కొత్తకారు ‘‘సెల్తోస్‌’’ను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నామని ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలంటూ సీఎం జగన్ ను కోరారు.  

ఈ సందర్భంగా కియా కంపెనీ ఉత్పత్తులపై ఎండీ కూక్‌ హ్యున్‌ షిమ్, చీఫ్‌ అడ్మినిస్ట్రేవ్‌ ఆఫీసర్‌ థామస్‌ కిమ్‌ సీఎం జగన్ కు వివరించారు. ఏడాదికి 3 లక్షల కార్లను అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటుద్వారా ఉత్పత్తిచేయగలమని స్పష్టం చేశారు. 

భవిష్యత్తులో 7 లక్షల కార్లను తయారుచేసే సామర్థ్యానికి చేరుకుంటామని తెలిపారు. ప్రస్తుతం టర్కీ, స్లొవేకియాలకు ఇంజిన్లనుకూడా ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే కియా కొత్తకారు సెల్తోస్ ప్రారంభోత్సవానికి సీఎం జగన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.