చేనేత కార్మికుల కష్టం తెలుసు కాబట్టే తాను ఆ రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని చెప్పినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేనేత కార్మికుల కుటుంబాలతో పవన్ ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు పెట్టే ప్రలోభోలకు లొంగిపోయి ఓట్లు వేయొద్దన్నారు. అన్నం పెట్టే రైతుకు, బట్టలు నేసే నేతన్నకు ఎన్నో కష్టాలు ఉన్నాయని.. వీటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.

Also Read:జగన్‌పై వ్యాఖ్యలు: రేణుదేశాయ్ వ్యవహారం ప్రస్తావన, పవన్‌కు వైసీపీ కౌంటర్

చేనేత కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి తెలిపేందుకు గాను తాను రాష్ట్రంలో రౌండ్ టేబులో సమావేశాలు ఏర్పాటు చేస్తానని పవన్ తెలిపారు. చిన్నప్పుడు తాను చీరాలలో ఉండగా తమ ఇంటి పక్కనే మగ్గాలు ఉండేవని, వాళ్ల కష్టాలు తనకు తెలుసునని జనసేనాని గుర్తుచేశారు.

రైతులు, నేతన్నలతో పాటు ఇతర రంగాలు సైతం దళారీల చేతుల్లో చిక్కుకుపోయాయని పవన్ చెప్పారు. సామాన్యుల కోసమే తాను జనసేన పార్టీని ఏర్పాటు చేశానని.. అధికారం కోసం కాదని పవన్ స్పష్టం చేశారు. 

Also Read:ప్రీతికి న్యాయం చేయనప్పుడు.. కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్ ఎందుకు: పవన్

హత్యాచారానికి గురైన బాలిక సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మంగళవారం పవన్ కల్యాణ్ కర్నూలులో ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని, లేనిపక్షంలో మరోసారి ర్యాలీ నిర్వహించి, నిరాహారదీక్షకు దిగుతానని జనసేనాని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.