Asianet News TeluguAsianet News Telugu

జగన్‌పై వ్యాఖ్యలు: రేణుదేశాయ్ వ్యవహారం ప్రస్తావన, పవన్‌కు వైసీపీ కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌పై కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పవన్ కర్నూలులో చేపట్టిన ర్యాలీ సందర్భంగా వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు హఫీజ్ కౌంటరిచ్చారు. 

kurnool ycp mla hafiz khan fires janasena chief pawan kalyan
Author
Kurnool, First Published Feb 12, 2020, 10:01 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌పై కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పవన్ కర్నూలులో చేపట్టిన ర్యాలీ సందర్భంగా వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు హఫీజ్ కౌంటరిచ్చారు. పవన్ కల్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

2017లో బాలికపై జరిగిన హత్యాచారానికి ఇప్పుడు న్యాయం చేయాలని అడగటం అర్థరహితమని హఫీజ్ మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనపై న్యాయం చేయాలని అడగటం ఏంటని ఆయన నిలదీశారు. చంద్రబాబు సూచన మేరకే పవన్ కర్నూలు వచ్చారా..? అని హఫీజ్ ప్రశ్నించారు.

Also Read:ప్రీతికి న్యాయం చేయనప్పుడు.. కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్ ఎందుకు: పవన్

ఎఫ్ఐఆర్, చార్జ్‌షీట్ నమోదు చేసింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అని.. దీనిపై విచారణ చేయించాల్సిందిగా బాధితురాలి తల్లిదండ్రులు కోరారని వారి విజ్ఞప్తి మేరకే మళ్లీ విచారణ జరిపిస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రీతి కేసులో విచారణ నిమిత్తం ప్రభుత్వం ఒక మహిళా అధికారిని నియమించిందని హఫీజ్ గుర్తుచేశారు.

బాబు హయాంలో జరిగిన సంఘటనను జగన్ పాలనలో జరిగినట్లుగా పవన్ మాట్లాడుతున్నారని.. పవన్ కల్యాణ్ వల్ల రేణు దేశాయ్ ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసునని హఫీజ్ గుర్తుచేశారు. శాంతి భద్రతల విషయంలో జగన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని.. మహిళల భద్రత కోసం సీఎం దిశ చట్టాన్ని తీసుకువచ్చారని హఫీజ్ తెలిపారు.

Also Read:అంతా దుష్ప్రచారమే.. బీజేపీ అలా చేయదు: సీఏఏపై పవన్ వ్యాఖ్యలు

21 రోజుల్లో బాధితులకు న్యాయం జరిగేలా దిశ చట్టాన్ని అమల్లోకి తెచ్చారని.. కర్నూలులో జరిగిన సంఘటనపై బాబును పవన్ నిలదీయాలని ఆయన సూచించారు. హత్యాచారానికి గురైన బాలిక పేరు ప్రస్తావించకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా జనసేనాని పవన్ కల్యాణ్‌కు లేదని ఆయన చురకలంటించారు.

ఇప్పటికే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్న ఉద్దేశ్యంతో డీజీపీని కలిశామని హఫీజ్ తెలిపారు. బాలిక పేరు చెప్పుకుని పవన్ కల్యాణ్ కర్నూలులో అడుగుపెట్టారని .. అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న ఆయనకు సీమలో అడుగుపెట్టే అర్హత లేదని హఫీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios