కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్ పెడతానని అంటున్నారని.. సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు ఇక్కడ న్యాయ రాజధాని పెట్టి ఉపయోగం ఏంటని పవన్ నిలదీశారు. తన బిడ్డను అత్యాచారం చేసి చంపేశారని ఒక తల్లీ ఎన్నో రోజులుగా రోడ్డు మీదకు వస్తుంటే ఇక్కడున్న ముఖ్యమంత్రికి, అధికారులు చీమకుట్టినట్లు కూడా లేదా అని జనసేనాని నిలదీశారు.

సుగాలి ప్రీతి విషయంలో పోలీస్ యంత్రాంగాన్ని తాను తప్పుబట్టడం లేదని.. తప్పంతా రాజకీయ నాయకులదేనని పవన్ ఆరోపించారు. రాజకీయ బాస్‌ల వల్ల అధికారులు మౌనం వహించారని మండిపడ్డారు.

సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ ఆమె తల్లి మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చి తనతో గోడు వెళ్లబోసుకున్నారని తెలిపారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. సుగాలి ప్రీతి దోషులను కఠినంగా శిక్షించాలంటూ పవన్ కల్యాణ్ బుధవారం కర్నూలులో ర్యాలీ నిర్వహించారు.

Also Read:పవన్ కర్నూలు పర్యటనలో ఉద్రిక్తత: అడ్డుకున్న విద్యార్థులు, పోలీసుల మోహరింపు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆమె ఆవేదన తనను కలచి వేసిందన్నారు. జనసేన తరపున ర్యాలీలు, కవాతులను తాను సరదా కోసం పెట్టనని ఈ ర్యాలీ కోసం రెండు నెలల క్రితమే ప్రీతికి న్యాయం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని పవన్ గుర్తుచేశారు.

అప్పటికి దిశ ఘటన జరగలేదని.. ఆ తర్వాత కూడా దిశ చట్టం తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి మహిళలకు అండగా ఉంటానని తెలిపారని చెప్పారని తెలిపారు. కానీ ప్రీతి విషయంలో ఇంత వరకు న్యాయం జరగలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

చట్టాలు బలహీనులకు చాలా బలంగా పనిచేస్తాయని.. కానీ బలవంతులకు మాత్రం చాలా బలహీనంగా పనిచేస్తాయని తెలిపారు. సుగాలి ప్రీతి విషయంలో జరిగింది ఇదేనన్న ఆయన పోస్ట్ పోర్టం నివేదిక, అత్యాచారానికి గురైందని చెప్పేందుకు ఆధారాలు ఉన్నా కానీ పట్టించుకున్న వాళ్లు లేరని మండిపడ్డారు. 

కర్నూలు యువత, ప్రజానీకం సుగాలి ప్రీతికి అండగా ఉంటారని తాను భావించానని అందుకే ఇవాళ ర్యాలీ నిర్వహించానని పవన్ తెలిపారు. దిశ నిందితులకు ఎలాంటి శిక్ష విధించారని.. వాళ్లను ఎన్‌కౌంటర్ చేయాలని తాను చెప్పనని కానీ సుగాలి ప్రీతి నిందితులకు కూడా కఠిన శిక్ష పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Also Read:పవన్ పర్యటన.. ప్రభుత్వంలో కదలిక: సుగాలి ప్రీతి కేసు సీబీఐ చేతికి...?

ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కేసును లిఖితపూర్వకంగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించని పక్షంలో జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తానని జనసేనాని హెచ్చరించారు.

దిశకు న్యాయం చేయాలంటూ అమరావతిలో కూర్చొని గట్టి ఉపన్యాసాలు ఇచ్చారని, మరి కర్నూలులో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి  ఎందుకు మాట్లాడరని పవన్ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ చేసిన ప్రతి పనినీ రివర్స్ టెండరింగ్ పేరుతో మళ్లీ సమీక్షిస్తున్నప్పుడు మరి వారి హయాంలోనే జరిగిన సుగాలి ప్రీతి కేసును ఎందుకు పట్టించుకోరన్నారు. 

తప్పు చేసినది ఎలాంటి వారైనా సరే వారికి శిక్ష పడాలని పవన్ డిమాండ్ చేశారు. సీబీఐకి సుగాలి కేసును అప్పగించని పక్షంలో తాను నిరాహరదీక్షకు దిగుతానని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో పెట్టినట్లే కర్నూలులో కూడా దిశా పోలీస్ స్టేషన్‌ను పెట్టాలని పవన్ ప్రభుత్వాన్ని కోరారు.