అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి తరలిస్తూ సర్కార్ జీవో జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలు నమ్మి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించింది అర్థరాత్రి జీవోలు ఇచ్చేందుకేనా అని పవన్ ప్రశ్నించారు.

ఇలాంటి చర్యల వల్ల బలయ్యేది జీవోలపై సంతకాలు చేసే అధికారులేనని, జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేశారు. విజిలెన్స్ ఆఫీసును కర్నూలుకు ఎందుకు తరలిస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదని... ముఖ్యమంత్రి వైఖరితో అత్యున్నత స్థాయి అధికారి ఒకరు సెలవుపై వెళ్లాలని చూస్తున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

Also Read:ఆరోగ్యం బాగుంటే ఉంటా.. నా పోరు భావి తరాల కోసం: బాబు ఉద్వేగం

అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను విశాఖకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉద్యోగులకు మౌఖికంగా సమాచారం ఇచ్చింది.

ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం విజయవాడలో ఉంది. ఆ తర్వాత దశలవారీగా అమరావతి నుంచి కార్యాలయాలు విశాఖకు తరలించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నెలాఖరుకల్లా కీలక కార్యాలయాల తరలింపుపై ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. 

ప్రస్తుతం రాజధాని అమరావతి  ప్రాంతంలోని సచివాలయంలో ఉన్న రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్, సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు మార్చాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అదికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. 

Also Read:ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీ: పేర్లిచ్చిన టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్

హైకోర్టుతో పాటు న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటిని కర్నూలులో పెడతామని ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించారు. ఇందులో భాగంగానే మొదట విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూల్ కు తరలిస్తోంది. 

సచివాలయంలో ఉన్న కార్యాలయాలు తరలిస్తున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. కార్యాలయాల కోసం అవసరమైన భవనాలు ఎంపిక చేసి ఏర్పాట్లు చేయాలని కర్నూలు కలెక్టర్, ఆర్అండ్‌బీ అధికారులకు సీఎస్ నీలం సాహ్ని అదేశాలు జారీ చేశారు. 

Also Read:జగన్ పై దూకుడు: పవన్ కల్యాణ్ చేతులు కట్టేసిన బిజెపి పొత్తు

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు వస్తాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుండి ఏపిలో ఆందోళనలు మొదలయ్యాయి. నెలలు గడుస్తున్నా అమరావతి ప్రాంతంలో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడంతో మూడు రాజధానుల నిర్ణయానికి కాస్త బ్రేక్ పడిందని అందరూ అనుకున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ కార్యాలయాలను కర్నూల్ కు తరలించాలన్న జగన్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.