జగన్ పై దూకుడు: పవన్ కల్యాణ్ చేతులు కట్టేసిన బిజెపి పొత్తు
ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టినప్పటి నుండి ప్రజా సమస్యలపై చురుగ్గా పోరాడుతూ వచ్చిన పవన్ కల్యాణ్ బిజెపితో జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత కాస్త నెమ్మదించారు. వరుసగా సినిమాలు తీయడానికి సిద్దమైన ఆయన ప్రజా సమస్యలను మరీ ముఖ్యంగా రాజధాని సమస్యను కాస్త పక్కనపెట్టారు.
అమరావతి: జనసేన అధినేతగా స్వేచ్ఛగా రాజకీయ కార్యాచరణకు దిగిన పవన్ కల్యాణ్ కు ఇప్పుడు ఆ పరిస్థితి కొరవడింది. బిజెపితో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆయన తనంత తానుగా కార్యాచరణకు దిగి ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఏది చేయాలన్నా ఆయన బిజెపితో సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు.
ఏ వైపు రాజకీయాలు చేస్తూనే ఆయన సినిమాల్లో నటించడానికి సిద్ధపడ్డారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలు చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. వాటిలో హిందీ పింక్ రీమేక్ కూడా ఉంది. పింక్ సినిమాలో అమితాబ్ పోషించిన పాత్రను ఆయన తెలుగులో పోషించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను ఆయన చేయనున్నారు.
సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాలకే మొత్తం కాలాన్ని వెచ్చిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ మాట తప్పారనే ఉద్దేశంతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ జనసేనకు రాజీనామా చేశారు. జేడీ లక్ష్మినారాయణ బిజెపిలోకి వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఇది పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొంత విఘాతం కలిగించే పరిణామమే.
అయితే, మాజీ జేడీ లక్ష్మినారాయణపై పవన్ కల్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తాను రాజకీయాలు చేయడానికి సినిమాల్లో నటించడం తప్పడం లేదని ఆయన సమర్థించుకున్నారు. తాను సినిమాల ద్వారా సంపాదించి కోట్ల రూపాయలు రాజకీయాలకు ఖర్చు చేస్తానని, మిగతా వాళ్లు ఒక్క వేయి రూపాయలు కూడా ఖర్చు పెట్టరని ఆయన లక్ష్మినారాయణపై విరుచుకుపడ్డారు
ఇదిలావుంటే, ఎన్నికల్లో విజయం సాధించిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దాదాపుగా తిరుగుబాటు చేశారు. ఆయన వైఎస్ జగన్ కు జైకొడుతున్నారు. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులను పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తుండగా రాపాక సమర్థిస్తున్నారు. ఈ స్థితిలో ఆయనపై కూడా పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
బిజెపితో పొత్తుకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. వివిధ చోట్ల సభలు నిర్వహిస్తూ జగన్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు నడిపారు. అయితే, బిజెపితో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ జోరు తగ్గింది. తాను చేపట్టే కార్యక్రమాలను బిజెపి సమన్వయం చేసుకోవాల్సి రావడమే అందుకు కారణమని అంటున్నారు.