ఆంధ్ర ప్రదేశ్ లో గత ప్రభుత్వాల హయాంలో ఇళ్ళను పొందిన పేదలకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని జగన్ సర్కార్ ను ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు.  

అమరావతి: వన్ టైం సెటిల్ మెంట్ (one time settlement) పేరుతో పేదలను దోచుకుంటున్న ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నిన్న(సోమవారం) చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరసన ప్రదర్శనలు విజయవంతమయ్యాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (atchannaidu) పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు, పోలీసుల అడ్డంకులను చేధించుకుని మరీ నిరసన చేపట్టిన టీడీపీ శ్రేణులు బ్రహ్మాండంగా పోరాడాయన్నారు. ఓటీఎస్ (OTS) పై టీడీపీ (tdp) నేతలు, కార్యకర్తల పోరాటానికి అభినందనలు తెలిపారు అచ్చెన్నాయుడు. 

''ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న మా పార్టీ నేతలపై పోలీసులు పలుచోట్ల అన్యాయంగా విరుచకుపడ్డారు. పోలీసుల చర్యను ఖండిస్తున్నాం. పేదల కోసమే టీడీపీ పోరాడుతుంది. దశాబ్ధాల క్రితం కట్టిన ఇళ్లకు రిజిస్ట్రేషన్ల పేరుతో జగన్ రెడ్డి (ys jagan) వసూళ్లకు పాల్పడుతున్నారు. బలవంతం ఏమీ లేదని పైకి చెప్తూ.. ఓటీఎస్ కు డబ్బులు చెల్లించకుంటే పథకాలు ఆపేస్తామని పేదలను బెదిరిస్తున్నారు'' అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

''ప్రభుత్వ దుర్మార్గం పరాకాష్టకు చేరింది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని పీల్చుకుతింటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వాలి. సంపద సృష్టించడం చేతకాక రకరకాల కుయుక్తులు పన్ని ప్రజలపై పన్నులు మోపుతున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పేదల పక్షాన టీడీపీ పోరాడుతుంది'' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

read more రాజకీయ నేరగాళ్లతో ఇక పోరాటమే... పార్టీ కేడర్ సిద్దంగా వుండాలి...: టిడిపి స్ట్రాటజీ కమిటీ కీలక నిర్ణయాలు

గత ప్రభుత్వాల హయాంలో పేదలకు నిర్మించిఇచ్చిన ఇళ్లపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామంటూ వైసిపి ప్రభుత్వం ఓటిఎస్ (one time settlement) తీసుకువచ్చింది. ఇందులోభాగంగా ప్రభుత్వం నిర్ణయించిన రుసుము చెల్లించి ఇళ్ల రిజిస్ట్రేన్ చేయించుకోవాలని లబ్దిదారులకు సూచించారు. ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసివ్వడం బాగానే వున్నా అందుకోసం పేదల నుండి భారీగా డబ్బులు చేయడమే వివాదానికి దారితీసింది. 

ఇప్పటికే కరోనా మహమ్మారి వ్యాప్తితో ఆర్థికంగా చితికిపోయిన పేదల నుండి డబ్బులు వసూలు చేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టిడిపి అయితే మరో అడుగు ముందుకేసి నిరసనలకు పిలుపునిచ్చింది. ఇళ్ల ఉచిత రిజిస్ట్రేషన్ కోరుతూ ఈ నెల 20న మండల, మున్సిపల్ కార్యాలయాల వద్ద, 23న కలెక్టర్ కార్యాలయాల వద్ద టిడిపి నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

నిన్న(డిసెంబర్ 27) కూడా టిడిపి శ్రేణులు ఓటిఎస్ ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో టిడిపి నిరసనలు ఉద్రిక్తతకు దారితీసాయి. పోలీసులకు, నిరసనకారులకు తోపులాటలు చోటుచేసుకున్నాయి.

read more ఇదే మంచి అవకాశం... వాడుకోవాలా? లేదా? అన్నది మీ ఇష్టం..: ఓటిఎస్ పై సీఎం జగన్

దివంగత సీఎం ఎన్టీఆర్ హయాం నుండి కట్టిచ్చిన ఇళ్లకు జగన్ రెడ్డి ఓటీఎస్ పేరుతో పేదల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని టిడిపి ఆరోపిస్తోంది. ఓటీఎస్ వసూళ్లు పేదల మెడలకు ఉరితాళ్లుగా మారాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆయా ఇళ్లల్లో పేదలు నివసిస్తున్నారని... కాబట్టి ఇప్పటికే ఆ ఇళ్లు వారి సొంతమయ్యాయంటున్నారు. అలాంటిది ఇప్పుడు ఓటిఎస్ పేరిట సీఎం జగన్ రెడ్డి పేదవారి జీవితాలతో ఆడుకుంటున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. 

ఓటీఎస్ పథకం కింద పేదలెవరూ ప్రభుత్వానికి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని... టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ హామీఇచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం విశాఖ నగరంలో 52 వేల ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే కాకుండా సభకు వచ్చిన వారికి భోజనంతో పాటు బట్టలు పెట్టి గౌరవించినట్లు గుర్తుచేస్తున్న టిడిపి నాయకులు భవిష్యత్ లో తమ ప్రభుత్వం ఏర్పడగానే నిరుపేదలకు ఉచితంగానే ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని హామీ ఇస్తున్నారు.