Asianet News TeluguAsianet News Telugu

రాజకీయ నేరగాళ్లతో ఇక పోరాటమే... పార్టీ కేడర్ సిద్దంగా వుండాలి...: టిడిపి స్ట్రాటజీ కమిటీ కీలక నిర్ణయాలు

ఇక రాజకీయ ముసుగులో వున్న నేరగాళ్లతో పోరాడేందుకు సిద్దమయ్యేలా టిడిపి కేడర్, నాయకులను సిద్దం చేయనున్నట్లు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు తెలిపారు.ఇవాళ జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో ఇలాంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

TDP Strategy Committee Meeting Decisions
Author
Amaravathi, First Published Dec 13, 2021, 5:34 PM IST

అమరావతి: జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలను దోపిడీ చేస్తోందని ప్రతిపక్ష తెలుగుదేశం (TDP) పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటిఎస్ (వన్ సెటిల్ మెంట్ OTS) ను అడ్డుకునేందుకు నిరసనలకు టిడిపి పిలుపునిచ్చింది. అలాగే రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించేందుకు టిడిపి ముఖ్యనాయకులు సమావేశమయ్యారు. 

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. టిడిపి స్ట్రాటజీ కమిటీ సమావేశంలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

టిడిపి స్ట్రాలజీ కమిటీ నిర్ణయాలివే: 

1. పేదల మెడకు ఉరితాళ్లుగా ఓటీఎస్ వసూళ్లు మారాయి – ఉచిత రిజిస్ట్రేషన్ కోరుతూ 20.12.2021న మండల, మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసనలు - 23.12.2021న కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని తీర్మానించడమైంది. 

2. ఎన్టీఆర్ హయాం నుండి కట్టిచ్చిన ఇళ్లకు జగన్ రెడ్డి ఓటీఎస్ పేరుతో పేదల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఓటీఎస్ వసూళ్లు పేదల మెడలకు ఉరితాళ్లుగా మారాయి. ఎన్నో ఏళ్లుగా ఆయా ఇళ్లల్లో పేదలు నివసిస్తున్నారు. ఆయా ఇళ్లు వారి సొంతం. పేదవారి జీవితాలతో ఆడుకుంటున్న జగన్ రెడ్డి తీరును సమావేశంలో పాల్గొన్న నేతలు తీవ్రంగా ఖండించారు. ఓటీఎస్ పథకం కింద పేదలెవరూ ప్రభుత్వానికి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని తీర్మానించారు. టీడీపీ ప్రభుత్వం విశాఖ నగరంలో 52 వేల ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే కాకుండా సభకు వచ్చిన వారికి భోజనంతో పాటు బట్టలు పెట్టి గౌరవించినట్లు నేతలు ప్రస్తావించారు.

READ MORE  AP Skill development Corporation Scamలో రిటైర్డ్ ఐఎఎస్ లక్ష్మీనారాయణకు ఊరట: మధ్యంతర బెయిలిచ్చిన హైకోర్టు

3. కష్టంలో ఉన్న చిరకాల మిత్రుణ్ణి పరామర్శించిన వేమూరి రాధాకృష్ణపై క్రిమినల్స్ పై పెట్టిన విధంగా జీరో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు మీడియాపై దాడి చేయడమేనని సమావేశంలో నేతలు పేర్కొన్నారు.

4. కక్షసాధింపు కోసమే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై బురద జల్లుతున్నారు. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ప్రేమ్ చంద్రారెడ్డి ఎండీగా చెల్లింపులు చేశారు. ముందు ప్రశ్నించాల్సింది ప్రేమ్ చంద్రారెడ్డినే. ఆయనను ఎందుకు ప్రశ్నించడం లేదు? సాక్షి సంతకం చేసిన వారిపై అక్రమ కేసులు పెట్టడం అధికార దుర్వినియోగమే. ప్రజా వ్యతిరేకత, సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై విచారణ అంటున్నారు. నిజాయితీపరుడైన లక్ష్మీనారాయణను లక్ష్యంగా చేసుకొని టీడీపీపై బురద జల్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నేతలు పేర్కొన్నారు.

5. రాజకీయ ముసుగులో ఉన్న నేరగాళ్లతో పోరాడాల్సి వస్తోంది. సవాళ్లకు అనుగుణంగా కేడర్ ను, నాయకులను సమర్థంగా తీర్చిదిద్దుతాం. పోలీసులను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కౄరంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

6. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసే వారు కరువయ్యారు. రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మాల్సిన గత్యంతరం ఏర్పడింది. 75 కిలోల బస్తా సాధారణ రకం రూ.1,455, ఏ-గ్రేడ్ రకం 1,470 ఉండగా.. రైతులు కేవలం రూ.1000 కే విక్రయిస్తున్నారు. బస్తాకు రూ.500 వరకు నష్టపోతున్నారు. వరద బాధితులను జగన్ రెడ్డి పూర్తిగా విస్మరించారు. వారికి సరైన పరిహారం అందించే పరిస్థితి లేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. బిల్లులు రాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. రూ.7 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారు.

READ MORE Chandrababu Naidu: ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా..?.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

7. ఈ నెల 17న తిరుపతిలో జరగనున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు కార్యక్రమానికి టీడీపీ సంఘీభావం తెలుపనుంది. అమరావతిపై మడమ తిప్పనని చెప్పిన జగన్ రెడ్డి ప్రతి అంశంలోనూ యూటర్న్ తీసుకున్నారు. 13 జిల్లాల చిన్న రాష్ట్రం, చిచ్చు పెట్టడం ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. రూ.2 లక్షల కోట్ల సంపద, యువతకు ఉద్యోగాలు కల్పించి, రాష్ట్రానికి ఆదాయం పెంచే నగరం అమరావతి. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అంతా నాశనం చేశారు. 15వ తేదీన అమరావతి మహాపాదయాత్రకు సంఘీభావంగా అన్ని నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

8. ప్రైవేటు లే అవుట్లలో 5  శాతం భూమి ఇవ్వాలని జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుంది. గతంలో తీసుకువచ్చిన నిబంధనలు ప్రభుత్వ ఆదాయ  మార్గంగా కాకుండా అక్కడ నివసించే వారి సౌకర్యాల కోసం రూపొందించారు. ఈ నిర్ణయం వెనుక కుట్ర దాగి ఉందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కె. అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్ల రామయ్య, నిమ్మకాయల చినరాజప్ప,  పయ్యావుల కేశవ్, కేఎస్ జవహర్, ధూళిపాళ్ల నరేంద్ర, బీద రవిచంద్ర యాదవ్, దేవినేని ఉమామహేశ్వరరావు, బీసీ జనార్థన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, టీడీ జనార్థన్, పి.అశోక్ బాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గురజాల మాల్యాద్రి, పట్టాభిరాం, మద్దిపాటి వెంకటరాజు, చింతకాయ విజయ్ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios