కిరణ్‌ చేరినా ఆ పార్టీకి అంత సీన్‌ లేదు: ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

Former MP Undavalli Arun Kumar interesting comments on Kiran kumar reddy
Highlights

తాను ఏ పార్టీలో చేరబోనని  రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.తలుపులు మూసేసి  రాష్ట్రాన్ని విభజించినా కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆ బిల్లుకు సహకరించినా బీజేపీలో కూడ తాను చేరనని చెప్పారు

హైదరాబాద్: తాను ఏ పార్టీలో చేరబోనని  రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.తలుపులు మూసేసి  రాష్ట్రాన్ని విభజించినా కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆ బిల్లుకు సహకరించినా బీజేపీలో కూడ తాను చేరనని చెప్పారు. రాజకీయాలనే ఉద్యోగం నుండి తాను రిటైరయ్యాయని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. 

ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.  కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు  తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినా తాను మాత్రం  ఏ పార్టీలో చేరనని చెప్పారు. 

ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తారని  భావించడం లేదన్నారు. 2019 లో ఏపీలో  కాంగ్రెస్ పార్టీకి  ఒక్క ఎంపీ సీటు కూడ దక్కకపోవచ్చన్నారు. పొత్తులుంటే మాత్రం పరిస్థితుల్లో మార్పులు ఉండే అవకాశం లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

కిరణ్‌కుమార్ రెడ్డి లాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరినా కానీ ఏపీలో ఆ పార్టీకి  2019లో ఒంటరిగా పోటీచేస్తే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చన్నారు. బలమైన నేతలుంటే  ఒక్కటి రెండు సీట్లు వచ్చే అవకాశాలు లేకపోలేదన్నారు. అయితే 2024 నాటికి  కాంగ్రెస్ కు ఏమైనా పరిస్థితులు కలిసొచ్చే అవకాశాలు ఉండొచ్చన్నారు.

తాను కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీని ఆదుకొనే గొప్ప నాయకుడిని కాదన్నారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీతోనే ఇంతకాలం పాటు ఉన్నానని ఆయన చెప్పారు. తాను ఢిల్లీకి వెళ్తే కేవీపీ వద్ద ఉంటానని, పార్లమెంట్ కు వెళ్లినా సెంట్రల్ హాల్ లో ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలతోనే ఉంటానని ఆయన చెప్పారు. 

దేశంలో ఏ పార్టీ ఏ పార్టీతోనైనా కలిసే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిష్టులు కలవకపోవచ్చన్నారు. కాంగ్రెస్ కమ్యూనిష్టులు కలిసినా.. బీజేపీ కమ్యూనిష్టులు కలిసే అవకాశం లేదన్నారు.  ఏపీలో  వైసీపీ, టీడీపీలు కలవకపోయినా.. టీడీపీతో పాటు ఇతర పార్టీల మధ్య పొత్తులు కుదిరే అవకాశాలను తోసిపుచ్చలేమని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

   ఈ వార్త చదవండి రేప్ కేస్ అయింది, మీకేమొచ్చింది: రాష్ట్ర విభజనపై ఉండవల్లి సంచలనం

loader