హైదరాబాద్: ఏపీ పునర్విభజన బిల్లులో అనేక లోటుపాట్లు ఉన్నాయనే విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే తాను సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసినట్టు రాజమండ్రి మాజీ ఎంపీ  ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. ఆనాడు లోక్‌సభలో ఏపీ పునర్విభజన బిల్లు పాస్ చేయించడం  ఒకరకంగా రేప్  చేయడం లాంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు.  భవిష్యత్తులో  ఈ రకంగా ఎవరికీ జరగకూడదనే ఉద్దేశ్యంతోనే తాను కోర్టును ఆశ్రయించినట్టు ఆయన చెప్పారు.

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ తెలుగున్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ పునర్విభజన బిల్లు పాస్ చేసే సందర్భంలో చోటు చేసుకొన్న పరిణామాలను ప్రస్తావించారు. తలుపులను మూసేసి ప్రత్యక్షప్రసారాన్ని నిలిపివేసి  ఆనాడు  ఈ బిల్లును పాస్ చేయించారని ఆయన చెప్పారు. సంఖ్యాబలం లేని కారణంగానే ప్రత్యక్షప్రసారాన్ని నిలిపివేసి కనీసం సభలో ఉన్న ఎంపీలను లెక్కించకుండానే ఆ బిల్లు పాస్ చేశారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.

ఆనాడు సభలో ఏం జరిగిందనే విషయాన్ని నిర్భయంగా బయటపెట్టానని చెప్పారు. ఈ తప్పిదం భవిష్యత్తులో జరగకూడదనే ఉద్దేశ్యంతోనే తాను  కోర్టులో కేసు దాఖలు చేసినట్టు చెప్పారు. తనతో పాటు మరో 130 కేసులు కూడ దాఖలయ్యాయన్నారు.  అయితే ఈ కేసులన్నింటిని కలిపి  ఒకే సారి విందామని కోర్టు అభిప్రాయపడిందన్నారు. 4 వారాల్లో ఈ కేసు విషయమై  విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.

ఇదిలా ఉంటే ఈ కేసులో  కేంద్రం ఇంతవరకు అఫిడవిట్ దాఖలు చేయలేదన్నారు. మరో వైపు తమకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు.  ఆనాడు లోక్‌సభలో చోటు చేసుకొన్న పరిణామాలు ఒక రకంగా రేప్ లాంటిదేనన్నారు.  భవిష్యత్తులో ఎవరిపై ఈ రకంగా జరగకూడదనే ఉద్దేశ్యంతోనే తాను కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు.

ఏపీ పునర్విభన చట్టం సక్రమంగా చేసి ఉంటే  రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నిత్యం గొడవలు జరిగేవి కావన్నారు.  రెండు రాష్ట్రాల మధ్య అనేక విషయాలపై గొడవలు జరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాకుచెందిన 7 మండలాలను  ఏపీలో కలిపిన సమయంలోనే ప్రత్యేక హోదా ఇస్తే సరిపోయేదన్నారు.ఏపీ పునర్విభజన చట్టం సరిగా చేయలేదంటే  రెండు రాష్ట్రాలను కలపాలని అర్థం కాదన్నారు. 

వైసీపీలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఎక్కువగా ఉన్నారని ఆయన చెప్పారు.  ఒకవేళ జగన్ సీఎం అయితేనే తనకు తెలిసినవారు మంత్రులైతే  వారితో  తాను స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పారు.  చంద్రబాబునాయుడు సీఎం అయితే  టీడీపీలో కూడ కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు చేరారని, వారితో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉండదు...రహస్యంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుందని ఉండవల్లి చమత్కరించారు.

ఏపీ పునర్విభజన చట్టం విషయంపై తాను కోర్టులో దాఖలు చేసిన కేసు విషయమై  తనను చంద్రబాబునాయుడు పిలిపిస్తేనే సీఎం కార్యాలయానికి వెళ్లినట్టు ఆయన చెప్పారు. తాను చెప్పిన  విషయాలన్నీ బాబు  విని సంతృప్తి చెందారని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. టీడీపీ ఎంపీలకు  ఈ విషయాలను తాను వివరించినట్టు ఆయన తెలిపారు.  ఈ విషయమై టీడీపీ ఎంపీలు  పార్లమెంట్ లో ప్రస్తావిస్తారని  భావిస్తున్నట్టు ఉండవల్లి చెప్పారు.

పవన్ కళ్యాణ్  తనను పిలిస్తేనే వెళ్లినట్టు చెప్పారు.  పవన్ కళ్యాణ్‌పై తనకు ఆనాడు ఎంత గౌరవం ఉందో ఇవాళ కూడ అదే గౌరవం ఉందని చెప్పారు.  తాను రాజకీయాల్లో నుండి రిటైర్ అయ్యాయని చెప్పారు. 

కేంద్రంపై  ఇటీవల టీడీపీ అవిశ్వాసాన్ని ప్రతిపాదించిన సమయంలో  చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు.  స్పీకర్ సుమిత్రా మహాజన్  ప్రధాని మోడీకి విశ్వాస పరీక్షకు మద్దతుగా, వ్యతిరేకంగా ఉన్నవారిని డివిజన్ కోరారని చెప్పారు. విశ్వాసానికి వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు వచ్చాయని  ఉండవల్లి చెప్పారు. ఇలాంటి చిన్న విషయాలను కూడ గమనించని వాళ్లు పార్లమెంట్ లో ఉండడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. 

ఈ వార్త చదవండి:కిరణ్‌ చేరినా ఆ పార్టీకి అంత సీన్‌ లేదు: ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు