అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భవిష్యత్తులో భారీ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. హిందూ ఎజెండాను తీసుకుని బిజెపి దూకుడు ప్రదర్శిస్తోంది. సోము వీర్రాజు బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆంధ్రప్రదేశ్ బిజెపిలో ఉత్సాహం కనిపిస్తోంది. సోము వీర్రాజు ఎక్కడ ఏది జరిగినా అక్కడికి వెళ్లి ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు.. 

పరిస్థితులు కూడా సోము వీర్రాజుకు కలిసి వస్తున్నాయి. దాంతో ఆయన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వెనక్కి నెట్టి తాను దూసుకుపోతున్నారు. టీడీపీ బిజెపిని అనుసరించాల్సిన పరిస్థితిలో పడింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు తాను వెనక పడిపోతున్నాననే దిగులు లేదు. బిజెపితో పొత్తు వల్ల తాను ఓ పోరులో పోటీ పడాల్సిన అవసరం లేదు. 

Also Read: వరుస ఘటనలు, సోము హిందూ ఎజెండా: ఆ ముద్రతోనే జగన్ కు చిక్కులు

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకీ తామే ప్రత్యామ్నాయంగా మారుతామని చెబుతూ వచ్చిన బిజెపి నాయకులు తమ వ్యూహానికి ఆచరణ రూపం ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏపీలో హిందూ దేవాలయాల్లో వరుస సంఘటనలు జరుగుతున్నాయి. వాటిని ఆసరా చేసుకుని సోము వీర్రాజు దూసుకుపోతున్నారు. 

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల మీద దాడులు పెరిగాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సోము వీర్రాజు నేతృత్వంలోని బిజెపి ప్రతినిధుల బృందం గవర్నర్ ను కలిసి వినతి పత్రం కూడా సమర్పించింది. హిందూ దేవాలయాలపై జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు పెరిగాయనే విషయాన్ని వారు గవర్నర్ దృష్టికి తెచ్చారు. 

Also Read: దుర్గగుడి రథం సింహాల ప్రతిమలు మాయం: విచారణకు ఆదేశించిన జగన్ సర్కార్

హిందూ ఎజెండాను తీసుకుని బిజెపి జగన్ మీద పోరాటానికి చంద్రబాబుకు ఎజెండా ఇస్తున్నారు. ఇటీవల జరిగిన అంతర్వేది ఘటనపై గానీ తాజాగా ముందుకు వచ్చిన దుర్గగుడి రతం ప్రతిమల మాయం ఘటన గానీ అదే విషయాన్ని తెలియజేస్తోంది. అంతర్వేది ఘటనపై బిజెపి స్పందించిన తర్వాతనే టీడీపీ నాయకులు ముందుకు వచ్చారు. 

దుర్గ గుడి రథం ప్రతిమల మాయం ఘటనపై కూడా అదే జరుగుతోంది. ఈ సంఘటనపై బిజెపి స్పందన తర్వాతనే తెలుగుదేశం నాయకులు దేవినేని ఉమా మహేశ్వర రావు, బుద్ధా వెంకన్న తదితరులు స్పందించారు. దూకుడు ప్రదర్శిస్తున్న బిజెపి ఆ మేరకు ప్రజల మద్దతును పొందుతుందా, టీడీపీని వెనక్కి నెట్టే వ్యూహంలో ఫలితం సాధిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.