విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలోని వెండి రథంపై ఉన్న సింహాల ప్రతిమలు మాయమైన ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథంపై సింహాల ప్రతిమలు మాయమయ్యాయని ప్రచారం సాగుతోంది. బుధవారం నాడు ఈ రథాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా ఆ పార్టీ నేతలు పరిశీలించారు. మూడు సింహాల ప్రతిమలు అదృశ్యమయ్యాయని బీజేపీ నేతలు ఆరోపించారు. 

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది.  దుర్గగుడి రథంపై ఉన్న సింహాల ప్రతిమలు ఏమాయ్యాయనే విషయమై విచారణకు ఆదేశించింది. ఈ విషయమై పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ రీజినల్ కమిషనర్ మూర్తిని విచారణ అధికారిగా నియమిస్తూ దేవాదాయశాఖ ఆదేశించింది.

సింహాల ప్రతిమలు ఎక్కడున్నాయి.. ఎప్పుడు అదృశ్యమయ్యాయి... దీనిలో ఎవరి పాత్ర ఉందనే విషయాలపై మూర్తి కమిటి విచారణ చేయనుంది. ఈ నెల 5వ తేదీ రాత్రి అంతర్వేది ఆలయ రథం దగ్ధం కావడంపై  దేవాదాయ శాఖ ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.