Sakshi office violence sparks outrage: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోని సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే ఏలూరులోని సాక్షి కార్యాలయానికి ఎవరో దుండగులు నిప్పు పెట్టారు.
Sakshi office attack: ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి మీడియా కార్యాలయాలపై పలుచోట్ల దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సాక్షి కార్యాలయంపై పలువురు దుండగులు రాళ్లతో పాటు పెట్రోల్ బాటిళ్లతో దాడి చేశారు. దీంతో కార్యాలయాని నిప్పు అంటుకుంది.
ఈ ఘటనలో సాక్షి కార్యాలయంలోని ఫర్నిచర్, సోఫాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే, అక్కడే నిలిపివున్న కార్యాలయ ఉద్యోగికి చెందిన కారు కూడా ధ్వంసమైంది. ఇది కూటమి ప్రభుత్వ నేతల పనే అని వైకాపా ఆరోపించింది.
మహిళపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సాక్షికి వ్యతిరేకంగా అమరావతి మహిళలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ ర్యాలీని తీశారు. తాము ప్రశాంతంగా నిరసనలు తెలుపుతూ ర్యాలీగా వేళ్తే తమపైనే నిందలు మోపుతున్నారని టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సాక్షి కార్యాలయంపై కూడా మంగళవారం ఉదయం దాడి జరిగిందని సమాచారం. పలువురు కార్యాలయం బోర్డును ధ్వంసం చేసి, ఆస్తికి నష్టం కలిగించారని వైపాకా పేర్కొంది. కూటమి ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులపై విమర్శలు గుప్పించింది.
వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోని సాక్షి మీడియా కార్యాలయాలపై జరిగిన దాడులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. టీడీపీ నాయకత్వంలోని గుంపులు సృష్టించిన ఈ హింసాత్మక ఘటనల వెనుక రాజకీయం ఉందనీ, మహిళల గౌరవం పేరిట కుట్రాత్మకంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. తన 'ఎక్స్' (X) పోస్టులో జగన్ స్పందిస్తూ.. మహిళల గౌరవాన్ని కాపాడుతున్నట్టు నాటకంతో, టీడీపీ నేతృత్వంలోని గుంపులు పలు జిల్లాల్లో సాక్షి యూనిట్ ఆఫీసులపై దాడులకు పాల్పడ్డారనీ, ఇది పూర్తిగా ఒక ప్రణాళికబద్ధమైన రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొన్నారు.
ఈ వివాదం ఎక్కడ మొదలైంది?
జూన్ 9న సాక్షిలో నడిచిన ఓ చర్చా కార్యక్రమంలో అమరావతి ప్రాంత మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై యాంకర్ కేఎస్‌ఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు కోర్టు ఆయనను మంగళవారం పోలీసు రిమాండ్ కు అప్పగించింది. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో సాక్షి కార్యాలయాలు టార్గెట్ గా మారాయి.
