తల్లికి వందనం పథకంలో రూ.15వేలు పొందాలంటే హౌస్ డేటా నమోదు, కేవైసీ, NPCI లింకింగ్ తప్పనిసరి, అర్హతలతోపాటు అవసరమైన పత్రాలు సమర్పించాలి.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం తల్లులకు ఆర్థికంగా సాయం అందించే ‘తల్లికి వందనం’ (Talliki Vandanam)పథకాన్ని త్వరలో ప్రారంభించనుంది. విద్యార్థుల భవిష్యత్ కోసం రూపొందించిన ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో సంవత్సరానికి రూ.15వేలు జమ చేయనున్నారు. ఇది మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది.
అయితే ఈ మొత్తం తల్లి ఖాతాలో చేరాలంటే మూడు ముఖ్యమైన ప్రక్రియలు పూర్తి చేయడం తప్పనిసరి. మొదటగా తల్లి మరియు పిల్లల వివరాలు హౌస్ హోల్డ్ డేటా బేస్‌లో నమోదు చేయాలి. ఈ డేటా లేకుండా ప్రభుత్వం ఎలాంటి నగదు పంపిణీ చేయదని స్పష్టం చేశారు.
రెండోది ఈకేవైసీ ప్రక్రియ. తల్లి పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్‌లో కేవైసీ పూర్తయి ఉండాలి. ఇది పూర్తవ్వకపోతే డబ్బులు అకౌంట్‌కు జమ చేయడం జరగదు. కేవైసీ కోసం స్థానిక బ్యాంక్‌ను లేదా సచివాలయం, మీసేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.
ఆధార్‌తో NPCIకి లింక్…
మూడవ ముఖ్యమైన దశ NPCI లింకింగ్. తల్లి అకౌంట్‌ను ఆధార్‌తో NPCIకి లింక్ చేయాలి. ఇది లింక్ అయి ఉంటేనే ప్రభుత్వం అందించే నగదు సరిగా తల్లి ఖాతాలో చేరుతుంది. ఆధార్ లింక్ లేకపోతే లబ్ధి పొందే అవకాశం కోల్పోతారు. NPCI లింకింగ్ కోసం తల్లి తన ఖాతా ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ప్రక్రియను పూర్తి చేయాలి. అలాగే NPCI అధికార వెబ్‌సైట్‌లో కూడా లింకింగ్ స్థితి చెక్ చేసుకోవచ్చు.
ఈ పథకాన్ని పొందాలంటే కొన్నింటిని నిర్ధారించుకోవాలి. విద్యార్థి రాష్ట్ర నివాసి కావాలి. ప్రభుత్వ గుర్తింపు ఉన్న స్కూల్‌లో చదువుతూ కనీసం 75 శాతం హాజరు ఉండాలి. తల్లి పేరుతో బ్యాంక్ ఖాతా ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి లోబడి ఉండాలి.
దరఖాస్తు సమయంలో స్టడీ సర్టిఫికేట్, తల్లి ఆధార్, తల్లి ఖాతా వివరాలు, నివాస పత్రం లేదా రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ, అవసరమైతే ఆదాయ ధ్రువీకరణ పత్రం, స్కూల్ హాజరు సర్టిఫికేట్ వంటివి అవసరం.
ఈ విధంగా తల్లికి వందనం పథకం ద్వారా విద్యాభివృద్ధికి తోడ్పడడమే కాకుండా తల్లుల ఆర్థిక స్థితిని మెరుగుపరచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.