ఏపీలో ఈ రోజు 15 జిల్లాల్లో 42°C దాటే ఎండలతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన.
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం భానుడు మరింత విజృంభించే అవకాశాలు కనపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితుల మధ్య.. మంగళవారం మాత్రం ఎండలు తీవ్రంగా ఉంటాయని అధికారులు తెలియజేశారు.
15 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా..
ఈరోజు రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అయ్యే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, మన్యం, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 నుంచి 42.5 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంది.
ఇక బుధవారం (జూన్ 11) నాడు కూడా ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 డిగ్రీల మధ్య ఉండొచ్చని అంచనా. అంటే రెండు రోజులు ఎండల ప్రభావం రాష్ట్రాన్ని వీడేలా కనిపించదు. అయితే మండుతున్న ఎండలు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని విపత్తు శాఖ వివరించింది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. దీంతో ప్రజలు ఒకేసారి ఎండ వేడి, వర్షం రెండింటినీ ఎదుర్కొనాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
వాతావరణ మార్పులతో ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో జనం ఎక్కువగా బయట ఉండకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. నీరు ఎక్కువగా తీసుకోవడం, బయటకు వెళ్లినప్పుడు తలకు టోపీలు ధరించడం వంటివి చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.