ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా వరి, మక్క పంటలు భారీగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు కొన్ని కీల ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో రెండు రోజులుగా కురిసిన వర్షాలపై సోమవారం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయం, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు నష్ట వివరాలను సీఎం ముందు ఉంచారు.
2,224 హెక్టార్లలో పంట నష్టం
పశ్చిమ గోదావరి, నంద్యాల, కాకినాడ, సత్యసాయి జిల్లాలు ఎక్కువగా ప్రభావితమైనవి. మొత్తం 2,224 హెక్టార్లలో వరి, మక్క పంటలు నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరిలో 15 మండలాల్లో 1,033 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. నంద్యాలలో 641 హెక్టార్లలో వరి పంట నష్టపోయింది. కాకినాడ జిల్లాలో 530 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. సత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, తోట పంటల నష్టం వివరాలను కూడా సీఎంకు అధికారులు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నష్టపోయిన ప్రతి రైతుకు వెంటనే పంట నష్ట పరిహారం (ఎక్స్‌గ్రేషియా) అందించాలని అధికారులను ఆదేశించారు. మే 6వ తేదీకి ముందే రైతులకు పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. అలాగే, ఈ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన 8 మంది కుటుంబాలకు తగిన నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని సూచించారు.
ఇంకా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, మానవ ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. సివిల్ సప్లయిజ్ స్పెషల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ నివేదిక ప్రకారం – రబీ సీజన్‌లో మొత్తం 20 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 13 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఇప్పటికే కొనుగోలు చేసినట్లు తెలిపారు. వర్షాల వల్ల దెబ్బతిన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఎటువంటి పరిస్థితుల్లోనూ రైతుల నుంచి ధాన్యం కొనాల్సిందేనని చంద్రబాబు తెలిపారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎక్కువ నిల్వలైన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ నిర్ణయాలతో సీఎం రైతులకు మద్దతుగా నిలబడినట్లు స్పష్టమవుతోంది. పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా ప్రభుత్వం స్పందించిన తీరుపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.

