ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు విద్యుత్ రంగ పునఃస్థాపనకు నూతన ప్రయాణం మొదలు పెట్టారు. అనుభవజ్ఞులతో కీలక చర్చలు జరిపినట్లు సమాచారం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడాన్ని కీలక ప్రాధాన్యంగా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలోని పవర్ యుటిలిటీలను ఆర్థికంగా పటిష్టంగా మార్చేందుకు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందేందుకు “పవర్ సెక్టార్ రీఫార్మ్స్ 3.0” అనే ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
ఈ చర్యలతో ముఖ్యంగా విద్యుత్ రంగానికి అవసరమైన నాయకత్వ మార్పులు జరగనున్నాయి. నిపుణుల నెట్‌వర్క్ ద్వారా, రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం మరియు పంపిణీ సంస్థల్లో కీలక పదవులకు అనుభవజ్ఞుల్ని నియమించడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, NTPC, ఇండియన్ రైల్వేస్ వంటి ప్రముఖ సంస్థల నుండి వచ్చిన వారిని ఈ పదవుల్లో నియమించడం విశేషం. మొత్తం 140 మందికిపైగా అభ్యర్థుల నుంచి జరిగిన పారదర్శక ప్రక్రియలో 16 కీలక నియామకాలు అధికారికంగా జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం, 2018-19లో రాష్ట్ర విద్యుత్ సంస్థల అప్పు రూ. 62,826 కోట్లు కాగా, 2023-24 నాటికి ఇది రూ. 1,12,422 కోట్లకు పెరిగింది. ఇది గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో ఏర్పడిన ఆర్థిక సమస్యల తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వం రంగ పునర్నిర్మాణంపై దృష్టిసారించింది.నూతన నాయకుల్లో APSPDCL లో ఆర్థిక వ్యవహారాలను చూసే బాధ్యతను అభిద్ రెహ్మాన్‌కు అప్పగించారు. ఆయనకు SBIలో ఉన్నత పదవుల్లో పని చేసిన అనుభవం ఉంది. అలాగే సెంట్రల్ డిస్కమ్ డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్‌గా ఎస్. వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం SBIలో చీఫ్ జనరల్ మేనేజర్‌గా ఉన్నారు. APGENCO ఆర్థిక, కమర్షియల్ కార్యకలాపాలను ఇప్పుడు కే. సీతారామరాజు పర్యవేక్షించనున్నారు. ఆయన ఇండియన్ రైల్వేస్ అకౌంట్స్ సర్వీస్‌లో పని చేశారు. NTPCలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, జిందాల్ పవర్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన కే. శ్రీనివాస్ ఇప్పుడు APPDCL డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఈ నియామకాలు, నూతన దిశగా విద్యుత్ రంగాన్ని తీసుకెళ్లే ముఖ్యమైన అడుగుగా భావించవచ్చు. ప్రభుత్వ నైపుణ్య ప్రాతిపదికన, పారదర్శకతతో కూడిన మేనేజ్‌మెంట్ దిశగా తీసుకున్న ఈ నిర్ణయాలు, రాష్ట్ర విద్యుత్ రంగ పునర్నిర్మాణానికి బలమైన బీజం వేస్తున్నాయి.ఇది చెల్లించాల్సిన బకాయిలను తగ్గించడంలో తోడ్పడుతుందని, ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


