ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో కలకం రేపిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారం తాజాగా అనంతపురం జిల్లాకు పాకింది. కనగానపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారని బట్టా నిర్మలా దేవీ, జయరామ్ చౌదరిలను సీఐడీ అధికారులు విచారించారు. తెల్లరేషన్ కార్డులు కలిగిన వారికి రాజధాని ప్రాంతమైన తాడికొండ మండలంలో భూములు ఉండటంతో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.

Also Read:చంద్రబాబుకు షాక్: సీబీఐకి అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్?

సాక్షాత్తూ తహసీల్దార్ కార్యాలయంలోని సీఐడీ సోదాల్లో నిజాలు బట్టబయలు కావడంతో రాజకీయంగా కలకం రేగుతోంది. ఈ క్రమంలో ఉదయం నుంచి తహసీల్దార్ నిర్మలాదేవిని సీఐడీ విచారిస్తోంది. మరోవైపు తాడిపత్రికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్‌ను కూడా సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. 

అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడానికి ముందు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తోంది. సుమారు 4,070 ఎకరాల కొనుగోలు వ్యవహారంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరిగిందని మంత్రి వర్గ ఉపసంఘం కూడా తేల్చింది. 

Also Read:ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

2014 డిసెంబర్ 31 రాజధాని ప్రకటన కంటే ముందే ఎందురు అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారనే దానిపై కమిటీ పరిశీలించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బంధువులు పేరిట భూముల కొనుగోలు జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌పై విచారణ జరిపించాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.