ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌పై విచారణ జరిపించాలని కోరుతూ అసెంబ్లీ బుధవారం తీర్మానం చేసింది. హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ తీర్మానాన్ని సభ ముందుకు తీసుకొచ్చారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడానికి ముందు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తోంది.

సుమారు 4,070 ఎకరాల కొనుగోలు వ్యవహారంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరిగిందని మంత్రి వర్గ ఉపసంఘం కూడా తేల్చింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనిని ఏదైనా ఏజెన్సీతో విచారణ జరపించాల్సిందిగా తీర్మానంలో పేర్కొన్నారు. 

Also Read:మొబైల్ చూసి నారా లోకేష్ లెక్కలు: తప్పు పట్టిన బొత్స, బుగ్గన అభ్యంతరం

రాజధాని భూముల విషయంలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై  విచారణ చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.   సోమవారం నాడు  ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాల మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు.

స్పీకర్ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని   సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.  సీఎం వైఎస్ జగన్ స్పీకర్ ఆదేశాలను పాటిస్తామని ప్రకటించి కూర్చోగానే మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విషయమై మాట్లాడారు. ఇదే సమయంలో స్పీకర్ గా  తాను విచారణ కోరే హక్కు ఉందా లేదా చెప్పాలని స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి  బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు.

స్పీకర్ గా  మీకు ప్రభుత్వాన్ని  ఆదేశించే హక్కుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.  దోషులెవరో కచ్చితంగా  తేలాల్సిన అవసరం ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తి విపక్షనేతగా ఉండడం తాము బాధపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

Also Read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

రాజధాని భూములపై  సమగ్ర విచారణ జరిగితే  దోషులెవరో తేలుతుందని చెప్పారు.  ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపించాలని సవాల్ చేసిన  చంద్రబాబు నాయుడు విచారణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తననే డిక్టేట్ చేస్తారా అని స్పీకర్  తమ్మినేని సీతారాం ప్రశ్నించారు.  ఈ సమయంలో టీడీపీ సభ్యులపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.