దివంగత ఎన్టీఆర్ అల్లుడు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆదివారం తనయుడితో కలిసి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం తెలుగు రాజకీయాల్లో దుమారాన్ని రేపింది.

తమ రాజకీయ భవిష్యత్తు డైలమాలో ఉండటం కుమారుడు హితేశ్ చెంచురామ్‌ పొలిటికల్ కెరీర్‌కు గట్టి పునాది వేసే ప్రణాళికలో దగ్గుబాటి దంపతులు ఉన్నారు. దీనిలో భాగంగానే తమ కుటుంబానికి తొలి నుంచి కంచుకోటగా ఉన్న పర్చూరు నుంచి హితేశ్‌‌ను పోటీకి దించే హామీపై దగ్గుబాటి వైసీపీలో చేరేందుకే జగన్‌తో చర్చలు జరిపారని కథనాలు వస్తున్నాయి.

సరిగ్గా ఇదే సమయంలో వీరిద్దరి భేటీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దగ్గుబాటి తోడల్లుడు చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో కామెంట్ చేశారు. కేవలం అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరిందని, ఆయన మారని పార్టీలు లేవని ఎద్దేవా చేశారు.

అలాగే అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్‌ను వాడుకున్న వారంతా తిరిగి వైసీపీ గూటికే చేరారని దుయ్యబట్టారు. అలాగే ఎన్టీఆర్ ప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు, ఎన్టీఆర్ బయోపిక్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన ప్రముఖంగా ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో అన్నగారి జీవితంలోని కాంట్రవర్సీలను వెండితెరపై ప్రజంట్ చేయడానికి వర్మ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాడు.

ఇంతకు ముందు అనౌన్స్ చేసి మధ్యలో ఆపేసిన ఈ సినిమాను పట్టాలెక్కించి ప్రస్తుతం రాకెట్ స్పీడ్‌తో మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రధానంగా వైశ్రాయ్ హెటల్, ఎన్టీఆర్ వెన్నుపాటు వ్యవహారాలను వర్మ హైలెట్‌ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

చంద్రబాబును విలన్‌గా చూపించే అవకాశమున్న ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ టీడీపీకి రానున్న ఎన్నికల్లో ఇబ్బందిగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ చీఫ్ జగన్ కనుసన్నల్లో ఈ సినిమా నిర్మిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ముందు నుంచి ఆరోపిస్తున్నాయి.

అందుకు తగ్గట్టుగానే వైసీపీ నేత రాకేశ్ రెడ్డి ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ చిత్రానికి నిర్మాత అని వర్మ ప్రకటించాడు. వైశ్రాయ్ హోటల్‌ ఎపిసోడ్‌లో చంద్రబాబుకు వెనుక నుంచి అన్ని రకాలుగా సాయపడ్డ ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అన్ని నిజాలు తెలుసు. 

ఎప్పటి నుంచో పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్న దగ్గుబాటిని జగన్ తన వద్దకు పిలిపించారని, లోటస్‌పాండ్‌కు వస్తూ వస్తూ ఎన్టీఆర్‌ గురించి రాసిన పలు పుస్తకాలను వెంకటేశ్వరరావు వైసీపీ అధినేతకు చూపించారని కథనాలు వస్తున్నాయి. 

అది ప్రధానంగా లక్ష్మీస్ ఎన్టీఆర్‌ స్క్రిప్ట్‌కు సాయం చేసేందుకేనని తద్వారా తనకు దెబ్బకొట్టేందుకు దగ్గుబాటి వేసిన ఎత్తుగడేమోనని టీడీపీ అధినేత భావన. ఇంతకీ వెంకటేశ్వరరావు తీసుకొచ్చిన పుస్తకాలేంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

దగ్గుబాటి మారని పార్టీలు లేవు: తోడల్లుడిపై చంద్రబాబు వ్యాఖ్యలు

వైసీపీలోకి హితేష్, బీజేపీలోనే పురంధేశ్వరీ: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

జగన్‌తో భేటీ: వైసీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్

ఆ క్లియరెన్స్ వస్తే వైసీపీలోకి హితేష్: పురంధేశ్వరీ బీజేపీలోనే?

హరిబాబు దూరం: విశాఖ సీటు పురంధేశ్వరిదే

జగన్‌కు క్లీన్‌చీట్,‌ దగ్గుబాటి లంచం పర్చూరు టికెట్: బుద్ధా వెంకన్న