ఒంగోలు: మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరీ తనయుడు హితేష్ త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉంది.అయితే సాంకేతిక సమస్యలను అడ్డు తొలగించుకొనేందుకు హితేష్ ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. ఈ సమస్యల విషయమై క్లియరెన్స్ వచ్చిన తర్వాత హితేష్ వైసీపీలో చేరే విషయాన్ని ప్రకటించనున్నారు.

దగ్గుబాటి హితేష్ అమెరికా సిటిజన్‌షిప్ ఉంది. దీన్ని వదిలివేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు హితేష్ అమెరికా ప్రభుత్వానికి  కొన్ని రోజుల క్రితం లేఖ రాశారు.

అమెరికా సిటిజన్‌షిప్ వదిలేసేందుకు రాసిన లేఖపై ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. హితేష్ కు అమెరికా నుండి ఈ విషయమై సమాచారం వచ్చిన వెంటనే వైసీపీలో చేరే విషయాన్ని హితేష్ ప్రకటించే ఛాన్స్ లేకపోలేదు.

విదేశీ పౌరసత్వం ఉన్నవారు దేశంలో చట్టసభలకు పోటీ చేయకూడదు. ఈ నిబంధన కారణంగానే హితేష్ అమెరికా ప్రభుత్వానికి తన సిటిజన్‌షిప్ వదులుకొనేందుకు లేఖ రాశారు.రెండు మూడు రోజుల్లో అమెరికా ప్రభుత్వ నుండి ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందిన పురంధేశ్వరీ సన్నిహితులు చెబుతున్నారు.

ఈ విషయమై స్పష్టత రాగానే వైసీపీలో చేరే విషయాన్ని హితేష్ ప్రకటించనున్నారు. వచ్చే ఎన్నికల్లో పర్చూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుండి హితేష్ పోటీ చేయనున్నారు. గతంలో ఈ స్థానం నుండి దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు ప్రాతినిథ్యం వహించారు.

హితేష్ వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో పురంధేశ్వరీ రాజకీయాల నుండి తప్పుకొనేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది.
కానీ, హితేష్ వైసీపీలో చేరినా తమకు అభ్యంతరం లేదని పురంధేశ్వరీని బీజేపీలోనే కొనసాగాలని ఆ పార్టీ నాయకత్వం చెప్పినట్టు తెలుస్తోంది.

ఏపీలో తమ ప్రధమ శత్రువు టీడీపీ అని, వైసీపీ కాదని బీజేపీ నేతలు పురంధేశ్వరీకి చెప్పినట్టు సమాచారం. ఒకవేళ హితేష్ వైసీపీలో చేరినా పురంధేశ్వరీ బీజేపీలో కొనసాగడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆ పార్టీ తేల్చి చెప్పింది.ఇదిలా ఉంటే పర్చూరు నుండి హితేష్‌కు వైసీపీ టిక్కెట్టు ఇస్తే ప్రచార బాధ్యతలను దగ్గుబాటి వెంకటేశ్వరరావు చూస్తారు.

సంబంధిత వార్తలు

హరిబాబు దూరం: విశాఖ సీటు పురంధేశ్వరిదే