ఢిల్లీ: దేశంలో నల్లధనం వెలిక్కితీయడమే తమ లక్ష్యమని ఫలితంగా ప్రతీ ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు కాబట్టే నోట్ల రద్దుకు మద్దతు తెలిపానని చంద్రబాబు నాయుడు తెలిపారు. నల్లధనం తెస్తామని చెప్పిన మాట మరచిపోయారన్నారు. ప్రతి ఒక్కరి బ్యాంక్‌ అకౌంట్‌లో నగదు జమచేస్తామన్నారు అది కూడా చెయ్యలేదని ఆరోపించారు.  

డిజిటల్‌ ఎకానమీ ద్వారా అవినీతి తగ్గుతుందని తాను మోదీకి సూచించానని డిజిటల్‌ ఎకానమీ వల్ల ఫిజికల్‌ కరెన్సీ డిమాండ్‌ తక్కువగా ఉంటుందని చెప్పినట్లు గుర్తు చేశారు. పెద్ద నోట్లు రద్దుచేస్తామని చెప్పి రూ.2వేల నోట్లు తీసుకొచ్చారన్నారు. నోట్ల రద్దుతో దేశంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా సరైన ప్రణాళిక లేకుండా అమలుచేశారని ఫలితంగా దేశంలో బ్యాంకులన్నీ స్థైర్యం కోల్పోయాయన్నారు. 

ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్‌ మోదీ, జతిన్‌ మెహతా, నితిన్‌ సందేశ్రా వంటి వాళ్లు దేశం విడిచి పారిపోయారన్నారు. బ్యాంకులకు ఎగనామం పెట్టిన వాళ్లను ఇప్పటికీ పట్టుకోలేకపోయారని వాళ్లు దేశం దాటించింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు.  

తెలంగాణకు ఇచ్చి ఆంధ్రాకు ఇవ్వలేదు, అది వివక్ష కాదా:చంద్రబాబు

మరోవైపు రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేసినట్లు చేసి వెనక్కి లాగేసుకున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రూ.350 ఇటీవల వాపస్‌ తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. విభజన చట్టంలోని 18 హామీలను నెరవేరుస్తామని ప్రధాని చెప్పారు కానీ ఏ ఒక్క హామీనీ పూర్తిగా  నెరవేర్చలేదన్నారు. హుధూద్ తుఫాన్ సమయంలో రూ.1000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి కేవలం రూ.650 కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. 

తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు మాత్రం రూ.450 కోట్లు ఇచ్చారని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ పరిస్థితుల్లో అక్కడ మీరు నిధులు ఇవ్వొచ్చు అది రాజకీయ కారణం నేను అర్థంచేసుకోగలను. కానీ ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇవ్వకపోవడం వివక్ష కాదా? అని నిలదీశారు. 

ఇకపోతే తిత్లీ తుఫాన్ ధాటికి తీవ్రంగా నష్టపోతే కనీసం కేంద్రప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖలు రాసినా కనీసం స్పందించలేదన్నారు. ఏపీలో పర్యటించిన హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలవైపు కన్నెత్తి చూడటం కాదు కదా కనీసం ఒక్కమాట కూడా మాట్లాడలేదని నిలదీశారు. 

తుఫాన్ ధాటికి శ్రీకాకుళం జిల్లా వాసులు తీవ్రంగా నష్టపోయి బాధల్లో ఉంటే కేంద్రమంత్రి పరామర్శించాల్సింది పోయి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఢిల్లీ వెళ్లిపోతారా అంటూ నిలదీశారు. తిత్లీ తుఫాన్ బాధితులను ఓదార్చడం ముఖ్యమా లేక పార్టీ కార్యాలయం ప్రారంభించడం ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. ఏపీలో ఏం జరుగుతుందో అన్న దానిపై ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 

గవర్నర్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కత్తితో దాడి ఘటనలో గవర్నర్ నరసింహన్ అత్యుత్సాహం ప్రదర్శించారని తెలిపారు. ఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాలని డీజీని కోరడం ఏంటని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఉందని తనకు కానీ సీఎస్ కు కానీ ఫోన్ చెయ్యాల్సింది పోయి నేరుగా డీజీపీకి ఫోన్ చేశారని విమర్శించారు. 

గతంలో ఏ గవర్నర్ ఇలా వ్యవహరించలేదని ఎద్దేవా చేశారు. ఘటన తర్వాత నరసింహన్ ఢిల్లీలో పర్యటించారని పలువురిని కలిశారని మరి ఎలాంటి నివేదికలు ఇచ్చారో వారికే తెలియాలంటూ సెటైర్లు వేశారు. గతంలో గవర్నర్ వ్యవస్త రద్దు కోసం తాను పోరాడినట్లు గుర్తు చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

కేంద్రంలో అంతా గుజరాతీలే, నచ్చని వాళ్లపై వేధింపులు: చంద్రబాబు

రేవంత్ రెడ్డిపై ఐటి దాడులు, రేపోమాపో నాపైనా జరగొచ్చు :చంద్రబాబు

తమిళనాడు తరహాలో ఏపీపై కుట్రకు కేంద్రం ప్లాన్:చంద్రబాబు

జగన్ పై దాడి ఘటనలో టీడీపీని నిందించడం సరికాదు: చంద్రబాబు

వైసీపీతో బీజేపీ రహస్య ఒప్పందం, వ్యతిరేక పార్టీలపై బీజేపీ వేధింపులు:చంద్రబాబు