ఢిల్లీ: కేంద్రప్రభుత్వంలో గుజరాతీలే అత్యధికంగా ఉన్నారని వాళ్లు ఇతర రాష్ట్రాలపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరు గుజరాతీలేనని ఆరోపించారు. అధ్యక్షుడు, ప్రధానిమంత్రి ఒకే రాష్ట్రానికి చెందిన వారైతే ఇలా వేధింపులకు పాల్పడతారని చంద్రబాబు మండిపడ్డారు. 

ఇకపోతే సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానా కూడా గుజరాతీయేనని చెప్పుకొచ్చారు. రాకేష్ ఆస్తానుకాపాడేందుకే అలోక్ వర్మను తప్పించారని చంద్రబాబు ఆరోపించారు. గుజరాతీలు అయితేనే చెప్పిన మాట వింటారన్న ఉద్దేశంతోనే కేంద్రంలోని కీలక శాఖల్లో వాళ్లనే నియమించుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

బీజేపీ అధికారంలో లేని ప్రాంతాల్లో, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎలాంటి దాడులు నిర్వహించాలి, ఎలాంటి వేధింపులకు పాల్పడాలి అనేది అంతా కేంద్రంలోని గుజరాతీ బృందమే ప్రణాళికలు రచిస్తోందని చంద్రబాబు దుయ్యబుట్టారు. తమకు నచ్చిన వాళ్లను ఒకలా నచ్చని వాళ్లను మరోలా ట్రీట్ చేస్తున్నారని తెలిపారు. తాను ఢిల్లీ 29సార్లు వెళ్లినా నిధులు విడుదల చెయ్యలేదంటే వాళ్ల కుట్రేనని చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారులు నీతి నిజాయితీలతో పనిచేస్తారని ఎవరికి లొంగరని తెలిపారు. అందువల్లే వారిని ఉత్తరప్రదేశ్ కు పంపించి వేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చెయ్యాలని చంద్రబాబు హితవు పలికారు.