ఢిల్లీ: ఏపీపై కేంద్రప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నిధులు ఇవ్వడంలో వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత తమపై వేధింపులకు కేంద్రం పాల్పడుతుందని ఆరోపించారు. ఇప్పటికే ఏపీలో ఐటీ దాడుల పేరుతో అలజడి సృష్టిస్తోన్న కేంద్రం త్వరలోనే తనపై కూడా దాడులు జరగొచ్చు అన్నారు. అయినా ప్రజల కోసం దాడులను ఎదుర్కొంటానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 

తమిళనాడు తరహాలో ఏపీలో కుట్ర చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఢిల్లీ, బీహార్, పాండిచ్చేరిలను టార్గెట్ చేసిన కేంద్రం అదే తరహాలో ఏపీని కూడా వేధించడం మెుదలుపెట్టిందని ఆరోపించారు. ఎన్డీఏ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చామో అప్పటి నుంచి టీడీపీపై కేంద్రం వేధింపులకు పాల్పడుతుందని మండిపడ్డారు. 

ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన వెంటనే 19 బృందాలతో ఏపీలో ఐటీ అధికారులతో దాడులు నిర్వహించి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ఇప్పుడిప్పుడే కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న తరుణంలో ఇలా దాడులు చేయడం ద్వారా ఏపీలో శాంతిభద్రతలు లేవంటూ ప్రచారం చేసి అభివృద్ధిని అడ్డుకునే కుట్ర చేశారని ఆరోపించారు. 
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని బీజేపీకి వ్యతిరేక వ్యక్తులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఎంపీ సీఎం రమేష్, తెలంగాణలో రేవంత్ రెడ్డి వంటి నేతల ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 

 ఏపీలో అస్థిరతకు కుట్ర పన్నుతుందని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటికే ఏపీలో ఐటీ దాడులతో వేధింపులకు పాల్పడుతున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. తమ పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ పై ఐటీ దాడులు నిర్వహించి భయాందోళనకు గురి చేశారని చెప్పారు. 

యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ 1 ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించానని చంద్రబాబు గుర్తు చేశారు. భారతదేశం గర్వించదగ్గ రాజకీయాలు చేశామని తెలిపారు. ఒక ప్రాంతీయ పార్టీగా 25 మంది పార్లమెంట్ సభ్యులతో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించానని చంద్రబాబు తెలిపారు. తాను నిన్నటి మెున్నటి వ్యక్తిని కాదని 14 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని తెలిపారు. 

40 ఏళ్లపాటు విలువలు కూడిన రాజకీయాలు చేశానని తెలిపారు. దేశంలో రెండో దశ ఆర్థిక సంస్కరణలను అమలు చేసిన ఏకైక సీఎం తానేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ను నిర్మించింది తానేనని, అనేక కంపెనీలు రావడంలో కీలక పాత్ర పోషించడానికి కీలక పాత్ర పోషించానని తెలిపారు. 

ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడూ రాని పన్ను ఎగవేత నోటీసులు ఎన్డీఏ నుంచి వైదొలిగిన తర్వాతే ఎందుకు వచ్చాయో ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. మోదీ ప్రభుత్వంలో అన్ని రంగాలు విఫలమయ్యాయాని తెలిపారు. త్వరలోనే కేంద్రానికి తగిన గుణపాఠం చెప్తారని చంద్రబాబు తెలిపారు.