Chandrababu Naidu Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 2న ప్రధాని మోడీ చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ క్ర‌మంలోనే రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో ప్రత్యేకంగా సమావేశమై ఆహ్వానించారు. రైతుల త్యాగాలను గౌరవిస్తూ ఎలాంటి నష్టం వాటిల్లే నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. 

Capital construction Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభం కార్యక్రమానికి రైతులను స్వయంగా ఆహ్వానించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… మే 2వ తేదీని రాష్ట్ర చరిత్రలో మలుపు తిప్పే రోజు అవుతుందని అన్నారు. అమరావతి పునఃప్రారంభం పనులు జరుగనున్న కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకాబోతున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు, సమస్యలపై చర్చించారు. 

రైతుల రిటర్నబుల్ ప్లాట్లపై బ్యాంకుల ద్వారా రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామకంఠాల్లో ఉండే కానీ పట్టాలు లేని వారికి పట్టాల మంజూరు చేస్తామని అన్నారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, స్టేడియం నిర్మాణంతో భూముల విలువ పెరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు 34,000 ఎకరాల భూమిని ఇచ్చారని గుర్తు చేస్తూ..రైతుల నమ్మకమే అమరావతికి బలమనీ, వారి ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ కార్యక్రమం ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం తీసుకున్న మూడురాజధానుల నిర్ణయం వల్ల రాష్ట్రాభివృద్ధికి ఆటంకం ఏర్పడిందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ రాజధాని నిర్మాణ పనులు వేగవంతం అవుతాయని తెలిపారు.

అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, క్రికెట్ స్టేడియం, రింగ్ రోడ్లు వంటి మౌలిక వసతుల కోసం మరికొంత భూమి అవసరమవుతుందని అన్నారు. గతంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు భూసేకరణ ఉదాహరణగా చూపుతూ, భవిష్యత్ అవసరాల కోణంలో ముందస్తుగా భూములు తీసుకోవడం వల్ల రైతులకు లాభాలు కలిగినట్లు వివరించారు. 

రాజధాని ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన రైతుల స్మృతిగా స్మారక చిహ్నం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. శాతవాహన కాలం నుండి అమరావతి ఉద్యమం వరకు జరిగిన చరిత్రను మ్యూజియంలో ప్రదర్శించనున్నారు.