హైదరాబాద్: చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా ఏపీలో పర్యటించేందుకు ఎంఐఎం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వచ్చేఏడాది ఆంధ్రప్రదేశ్‌లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఎంఐఎం పార్టీ వ్యూహాన్ని రచిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పర్యటించి బాబుకు తమ సత్తా చూపుతామని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. 

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీపీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి సీ టీమ్ ఎంఐఎం అంటూ కీలక ఆరోపణలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. 

చంద్రుడు నేను వస్తున్నా ఎన్నికల్లో ప్రచారం చేస్తా, మా సత్తా చూపుతాం అంటూ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఏయే జిల్లాల్లో ఎంతమంది ముస్లిం ఓటర్లున్నారు అనే దానిపై మజ్లిస్ నేతలు లెక్కలు తీసే పనిలో పడ్డారు.  చంద్రబాబుకు వ్యతిరేకంగా వారికి ఎలాంటి సందేశమివ్వాలనే అంశాలపై కసరత్తు చేస్తున్నారు నేతలు.  

ఇటీవలే ఏపీలో చంద్రబాబు నాయుడు ముస్లింలకు బాగా దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ముస్లింలకు కేబినేట్ లో ప్రాధాన్యత కల్పించడమే కాకుండా పలు కీలక పదవులు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ముస్లిం ఓట్లు ఎక్కడ తమకు గండిపడతాయా అంటూ వైసీపీ కూడా ఉలిక్కిపడుతోంది. 

ఈ నేపథ్యంలో ముస్లిం ఓట్లు చంద్రబాబుకు పడకుండా వైసీపీకి పడేలా అసదుద్దీన్ ఓవైసీ వ్యూహ రచన చేస్తున్నారు. అందుకు చంద్రబాబు నాయుడు పాలనా కాలాన్ని టార్గెట్ గా చేసుకుని మరీ రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ముస్లింలకు ఏం చేశారో అన్న దానిపై ప్రజల్లోకి వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు.  

ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తీసుకున్న పకడ్బందీ చర్యలను వివరిస్తూ ఏపీలో చంద్రబాబు సర్కార్ ముస్లింలకు చేస్తున్న సేవలను బేరీజు వేస్తూ ముస్లింలకు వివరించే ప్రయత్నాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. 

ఏపీలో ముస్లిం ఓటర్లు ఏడు శాతానికిపైగా ఉన్నారు అంటే రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దాదాపు రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములపై ప్రభావం చూపే సంఖ్య ముస్లింలు ఉండటంతో ఆ ఓటు బ్యాంకు టీడీపీకి వెళ్లకుండా వైసీపీ వైపుకి మళ్లించేందుకు పావులు కదుపుతున్నారు. 

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలుపెట్టారు కూడా. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీలో ఎంఐఎం నుంచి నలుగురు కార్పొరేటర్లు గెలిపించుకుని తమ ఉనికి చాటుకున్నారు.  

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పర్యటన ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందా అన్న కోణంలో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ మాటల మాంత్రికుడిగా, ఇరుకున పెట్టే వ్యాక్యలు చేసే వ్యక్తిగా పేరు. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి టీడీపీని ఎక్కడ ఇరుక్కున పెడతారో అనే చర్చ జోరుగా సాగుతోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ఆ స్ట్రాటజీ వాడితే...బాబుకు కష్టమే: అసదుద్దీన్ ఒవైసీ

జగన్‌కు ఒవైసీ ఫ్రెండ్ ఎప్పుడయ్యాడు: బాబు

జగన్ కే నా మద్దతు, నా ప్రభావం చంద్రబాబు చూస్తారు: అసదుద్దీన్ ఓవైసీ