ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైఎస్ జగన్‌కు మద్ధతు ప్రకటించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆయన తరపున ప్రచారం చేస్తానని చెప్పడంతో రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతోంది. ఈ పరిణామాలపై స్పందించారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన ఇవాళ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలకు ముందుగానే అభ్యర్ధులను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా క్యాడర్ సిద్దంగా ఉండాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాబు సూచించారు.

‘‘ మళ్లీ టీడీపీ రావాలి’’ అనే నినాదం మార్మోగాలని.. మళ్లీ రాకుంటే అభివృద్ది ఆగిపోయి, పేదల సంక్షేమం నిలిచిపోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విభేదాలను పక్కనబెట్టాలని.. ఎక్కడ భేషజాలకు పోరాదని సీఎం హితవు పలికారు. అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ మెజారిటీ పెరగాలన్నారు.

థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ... ఇటీవల ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కడా బీజేపీ గెలవలేకపోయిందని.. 3 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిందని చంద్రబాబు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే గెలిచాయని.. దేశప్రజలు మోడీ పాలనను తిరస్కరిస్తున్నారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల రైతుల్లో అశాంతి నెలకొందని, మైనారిటీల్లో అభదత్ర పెరిగిందన్నారు. దేశంలో మూడో కూటమికి అవకాశం లేదని... అది కేవలం భారతీయ జనతా పార్టీకి మేలు చేయడానికేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మేడ్చల్‌లో సోనియా చెప్పినందునే దానిని సాకుగా చూపి కేసీఆర్ మరోసారి తెలుగు ప్రజలు మధ్య సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ముఖ్యమంత్రి అన్నారు. ముందు హోదాకి అంగీకరించిన టీఆర్ఎస్ మళ్లీ అడ్డం తిరగడాన్ని తప్పుబట్టారు.

తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే.. ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారని, మహాకూటమి ఓటమి వైసీపీ నేతలకు పండుగలా ఉందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జగన్‌కు ఎప్పుడు స్నేహితుడయ్యాడని ప్రశ్నించారు. వీరికి సొంత ప్రయోజనాలే తప్పించి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని చంద్రబాబు ఆరోపించారు.