తల్లికి వందనం పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు ప్రతి సంవత్సరం రూ.15,000 ఇవ్వనుంది. అర్హతలు, డాక్యుమెంట్ల వివరాలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం తీసుకువచ్చిన తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. జూన్ 12న స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే రోజు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇది సూపర్ సిక్స్ పథకాలలో ఒకటి కాగా, అర్హులైన తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.15,000 చొప్పున నిధులు జమ చేయనుంది.

ఈ పథకానికి సంబంధించి కొంత సమాచారం ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉంది. ఇందులో తెలిపిన ప్రకారం, విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉండాలి. అలాగే కనీసం 75 శాతం హాజరుతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి. కుటుంబ ఆదాయం ప్రభుత్వ నిర్ణయించిన పరిమితికి లోబడి ఉండాలి.

తల్లులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ముందు, కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచాలి. వీటిలో విద్యార్థి స్టడీ సర్టిఫికెట్, తల్లి ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, హాజరు సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, అవసరమైతే ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉన్నాయి.

పథకం అమలు కోసం జూన్ 5 లోపు తల్లి బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్ ద్వారా NPCIకి లింక్ చేయాలని సూచించారు. ఇలా లింక్ చేయని వారు దగ్గరలోని పోస్టాఫీస్ లేదా గ్రామ సచివాలయాన్ని సంప్రదించవచ్చు. ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా మార్గదర్శకాలను విడుదల చేయకపోయినప్పటికీ, సామాన్యంగా ఉపయోగించే నిబంధనలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.