ఆంధ్రప్రదేశ్,తెలంగాణ లలో టెట్‌, డీఎస్‌సీ పరీక్షలు ఒకేరోజు ఉండటంతో వందలాది అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. రెండు పరీక్షల సమన్వయంపై ప్రభుత్వాలకు అభ్యర్థులు విఙప్తి చేస్తున్నారు.

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకు ఈ నెల పరీక్ష షెడ్యూల్ తలనొప్పిగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18 నుంచి 30 వరకు టెట్ (TET) నిర్వహించనుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే నెల 6 నుంచి 30 వరకూ డీఎస్‌సీ (DSC) పరీక్షలు షెడ్యూల్ చేసింది. ఈ రెండు పరీక్షల తేదీలు కలిపి 8 రోజులు ఉండడంతో అభ్యర్థులు ఒత్తిడిలో పడ్డారు.

ఏపీ డీఎస్‌సీ… నాన్‌లోకల్…

తెలంగాణకు చెందిన సుమారు 7,000 మంది అభ్యర్థులు ఏపీ డీఎస్‌సీకి నాన్‌లోకల్ కింద దరఖాస్తు చేశారు. వీరిలో కొంతమందికి పరీక్ష కేంద్రాలు హైదరాబాద్‌లో రావడం, మరికొంతమందికి ఏపీ వెళ్లి రాయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రత్యేకంగా జూన్ 20న రెండు రాష్ట్రాల్లో ముఖ్యమైన పరీక్షలు పడుతున్నాయి. తెలంగాణ టెట్‌లో పేపర్-1 ఉండగా, అదే రోజున ఏపీ డీఎస్‌సీలో ఎస్‌జీటీ పోస్టుల పరీక్ష ఉంది. ఈ కలయిక వల్ల వందల మంది ఏ పరీక్ష రాయాలనే అయోమయంలో ఉన్నారు.

దాన్ని వదిలేయాలనే ఆలోచన..

ఒకవైపు టెట్ పరీక్ష ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు కాబట్టి దాన్ని వదిలేయాలనే ఆలోచన చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ ఉపాధ్యాయ ఉద్యోగం లక్ష్యంగా ఉన్నవారు రెండు పరీక్షలూ రాయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి పరీక్షలు ఒకే రోజుకు పెట్టకుండా సమన్వయం సాధించాలని కోరుతున్నారు.

పరీక్షల ఒకేరోజు రావడంతో అభ్యర్థులకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.