అమరావతి: తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు.  సస్పెన్షన్‌తో  మానసికంగా తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో కీలకమైన ఇంటలిజెన్స్  విభాగానికి వెంకటేశ్వరరావు చీఫ్‌గా పనిచేశారు. ఆ సమయంలో వెంకటేశ్వరరావును లక్ష్యంగా చేసుకొని వైసీపీ పలు విమర్శలకు దిగిన విషయం తెలిసిందే.

Also read:చంద్రబాబు హయంలో నిఘా చీఫ్: ఏబీ వెంకటేశ్వర రావుకు బిగ్ షాక్

ఏపీ రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వలేదు. 8 మాసాలుగా ఆయన పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో శనివారం రాత్రి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 ఈ సస్పెన్షన్‌పై ఆదివారం నాడు ఉదయం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సస్పెన్షన్‌తో తనకు మానసికంగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తేల్చి చెప్పారు. అక్రమాలకు పాల్పడినట్టుగా మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తాను ఎలాంటి అక్రమాలకు కూడ పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు.

మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏబీ వెంకటేశ్వరరావు సూచించారు. తనపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఎదుర్కొనేందుకు చట్టపరంగా ముందుకు వెళ్లనున్నట్టుగా ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. 

తదుపరి తన కార్యాచరణ  ఏమిటనేది త్వరలోనే మీకు తెలుస్తోందని ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.ఈ కారణాన్ని చూపుతూ ఏపీ ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.