విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలు, పరిహారంపై మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

మరణించిన కుటుంబాల్లో లీగల్‌ హెయిర్‌ ఫైనల్‌ అయిన 8 మందిలో ఐదుగురికి నష్టపరిహారం అందించామని.. మిగిలిన వారు నగరానికి దూరంగా ఉన్నందున వారికి త్వరలోనే అందిస్తామని మంత్రులు జగన్‌కి వివరించారు.

గ్రామాల్లో, ఇళ్లల్లో శానిటేషన్‌ పనులు ప్రారంభమయ్యాయని,  సాయంత్రం 4 గంటలకల్లా ఇవి ముగుస్తాయని మంత్రులు వెల్లడించారు. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలను ఊళ్లలోకి అనుమతిస్తున్నామన్నారు.

Also Read:విశాఖలో భారీగా స్టైరిన్ నిల్వలు: నౌకల ద్వారా తరలింపుకు నిర్ణయం

బాధితులు చాలామంది ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారని, ఎక్స్‌టర్నల్ శానిటేషన్, ఇంటర్నల్ శానిటేషన్‌పై నిపుణులు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇచ్చారని మంత్రులు వివరించారు.

అనంతరం సీఎం స్పందిస్తూ... ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోని 5 గ్రామాల్లో ఈ రాత్రికి బసచేయాలని మంత్రులను ఆదేశించారు. శానిటేషన్‌ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఈ రాత్రికి ఊళ్లోకి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలన్నారు.  

గ్యాస్‌లీక్‌ ప్రభావిత గ్రామాల్లో పిల్లలైనా, పెద్దలైనా.. అందరికీ పదివేల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పెద్దమొత్తంలో డబ్బు ఉంటుంది కాబట్టి.. మహిళల ఖాతాల్లోనే జమ చేయాలని సీఎం ఆదేశించారు.

ఇందుకు సంబంధించి వారి వివరాలను బ్యాంకు ఖాతాలను గ్రామ వాలంటీర్లతో సేకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. పారదర్శకంగా, ఫిర్యాదులు లేకుండా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలు కొనసాగాలని జగన్ అన్నారు.

ఆర్థిక సహాయం పొందేవారి జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని, ఎవరిపేరైనా కనిపించకపోతే వారు ఎలా పేరు నమోదుచేసుకోవాలో వారి వివరాలను అందులో ఉంచాలన్నారు.

డబ్బు ఖాతాల్లో జమచేసిన తర్వాత వాలంటీర్ల ద్వారా వారికి స్లిప్‌ అందించి వారి నుంచి రశీదు తీసుకోవాలని జగన్ కోరారు. ఆస్పత్రిపాలైన వారికీ కూడా వీలైనంత ఆర్థిక సహాయం అందించాలని... గ్యాస్‌ లీక్‌ ప్రభావిత గ్రామాల ప్రజలకు వైద్యపరమైన సేవల కోసం క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నారు.

గ్యాస్‌ దుర్ఘటన సమయంలో బాధితులను ఆదుకోవడానికి, వారి ప్రాణాలను రక్షించడానికి అధికారులు,  పోలీసులు చాలా చక్కగా పనిచేశారని సీఎం ప్రశంసించారు. మరోవైపు జగన్ ఆదేశాలతో స్టెరెన్ తరలింపు ప్రక్రియను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

Also Read:విశాఖలో స్టైరిన్ గ్యాస్ లీక్: గ్రీష్మ కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లింపు

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్ సీఎంకు వివరాలు అందించారు. లీకేజీ సంభవించిన ట్యాంకులో ప్రస్తుతం 73 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉందని, అది సురక్షిత స్థాయిలోనే ఉందన్నారు. ట్యాంకులోని స్టెరెన్ కూడా దాదాపు 100 శాతం పాలిమరైజ్ అయ్యిందని వెల్లడించారు.

ఇదికాక ఇంకో ఐదు ట్యాంకుల్లో 13వేల టన్నుల స్టెరెన్‌ ఉందని, సీఎం ఆదేశాల ప్రకారం దీన్ని కొరియాకు తరలిస్తున్నామని వెల్లడించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..  ఒక్క విశాఖపట్నమే కాకుండా రాష్ట్రంలోని మిగతా పరిశ్రమల్లో కూడా తనిఖీలు చేయాలని ఆదేశించారు.

ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించేలా చేయాలని, అదే సమయంలో ప్రమాదకర పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలించే అంశంపైన కూడా ఆలోచనలు చేయాలన్న సూచించారు. విశాఖపట్నం గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీల అభిప్రాయాలను కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలన్నారు.