విశాఖలో స్టైరిన్ గ్యాస్ లీక్: గ్రీష్మ కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లింపు
ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుండి వెలువడిన విష వాయువు పీల్చిన తొమ్మిదేళ్ల గ్రీష్మ మరణించింది. బాధిత కుటుంబానికి మంత్రులు సోమవారం నాడు కోటి రూపాయాల చెక్ ను అందించారు.
విశాఖపట్టణం: ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుండి వెలువడిన విష వాయువు పీల్చిన తొమ్మిదేళ్ల గ్రీష్మ మరణించింది. బాధిత కుటుంబానికి మంత్రులు సోమవారం నాడు కోటి రూపాయాల చెక్ ను అందించారు.
ఎల్జీ పాలీమర్స్ నుండి స్టైరిన్ గ్యాస్ లీక్ కావడంతో మరణించిన కుటుంబాలకు కోటి రూపాయాల పరిహారాన్ని అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ఈ నెల 7వ తేదీన ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రీష్మ కుటుంబసభ్యులకు మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్ లు చెక్ ను అందించారు.
also read:విశాఖ దుర్ఘటన... గ్రామ వాలంటీర్లకే ఆ కీలక బాధ్యతలు: ముఖ్యమంత్రి నిర్ణయం
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకొన్న వారిని ఇంటికి తరలిస్తామని మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. ఈ విషవాయువు ప్రభావం ఉన్న ఐదు గ్రామాల్లో ప్రతి వార్డును శానిటైజ్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఐదు గ్రామాల్లోకి ప్రజలను అనుమతిస్తామని ఆయన చెప్పారు.ఇవాళ ఈ ఐదు గ్రామాల్లో తాము బస చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు.
బాధిత కుటుంబాలకు వాలంటీర్లు ఇంటికి వచ్చి పరిహారాన్ని అందిస్తారని మంత్రి ప్రకటించారు. పరిహారం కోసం ఎవరూ కూడ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.