సారాంశం

రాజ‌ధాని అమ‌వ‌రావ‌తికి చ‌ట్ట బ‌ద్ధ‌త క‌ల్పించే దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం కీల‌క అడుగు వేసింది. వైసీపీ హ‌యాంలో అమ‌రావ‌తి నిర్మాణం పూర్తిగా నిలిచిపోయిన నేప‌థ్యంలో. తిరిగి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ఈ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే అమ‌రావ‌తి పునఃనిర్మాణ ప‌నులు ప్రారంభించ‌గా తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 
 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ రాజధాని అమరావతిగా తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. దీంతో పాటు అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని మోదీకి క్యాబినెట్ ధన్యవాదాలు తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2014లో ఏర్పడిన పునర్విభజన చట్టం ప్రకారం, హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ తన స్వంత రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని చట్టంలో పేర్కొన్నారు.

ఆ సమయంలో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులను ప్రారంభించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానుల విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది. దీనివల్ల 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌ ఒక స్థిరమైన రాజధానిని లేకుండా పోయింది. 

2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించిన టిడిపి, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించారు. ప్రధాని పర్యటనకు ముందు, రాజధాని రైతుల బృందం సీఎం చంద్రబాబును కలసి అమరావతికి చట్టపరమైన స్థిరత్వం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తించేలా పునర్విభజన చట్టంలో తగిన మార్పులు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది. దీనివల్ల రాజధాని విషయంలో స్పష్టత ఏర్పడుతూ, అమరావతికి చట్టబద్ధత లభించనుందని మంత్రివర్గం అభిప్రాయపడింది.

ఏపీ క్యాబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు. 

* టీటీడీలో అర్బన్ డిజైన్ ప్లానింగ్ సెల్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

* చెరువుల్లో త‌వ్విన మ‌ట్టిని ఉచితంగా పొలాల‌కు తీసుకెళ్లేందుకు రైతుల‌కు అనుమ‌తి ఇచ్చారు.

* ఏటా పంట కాల్వ‌ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయాల‌ని నిర్ణ‌యించారు

* జ‌ల‌వ‌న‌రుల శాఖ‌లో కంపెనీల చ‌ట్టం కింద జ‌ల‌హార‌తి కార్పొరేష‌న్ ఏర్పాటు.

* ప‌ర్యాట‌క ప్రాజెక్టుల్లో ఉద్యోగ ఆధారిత ప్రోత్స‌హకాలు అందించేందుకు ఆమోదం. 

ఆప‌రేష‌న్ సిందూర్‌ను అభినందిస్తూ తీర్మానం:

ఆపరేషన్ సిందూర్‌ను అభినందిస్తూ ఏపీ కేబినెట్‌ తీర్మానం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతంపై కేంద్రానికి అభినందనలు తెలింది. ఉగ్ర‌వాదుల విష‌యంలో న‌రేంద్ర మోదీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా త‌మ మ‌ద్ధ‌తు ఉంటుంద‌ని చంద్ర‌బాబు గ‌తంలో తెలిపిన విష‌యం తెలిసిందే.