తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు(శనివారం) ఎండలు మండిపోతాయా? వర్షాలు కురుస్తాయా? వాతావరణం ఎలా ఉండనుందో తెలుసుకుందాం.

Andhra Pradesh Weather : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఎండాకాలమేమో జోరుగా వర్షాలు కురిసాయి.. ఇప్పుడు వానాకాలం ఆరంభమయ్యిందో లేదో తొలకరి జల్లులు కురిసే సమయంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా అయితే ప్రస్తుతం వర్షాల వల్ల ఇళ్లనుండి బయటకు వచ్చే పరిస్థితి ఉండకూడదు... కానీ ఎండలవల్ల బయట తిరగలేని పరిస్థితి ఉంది. ఈ వర్షాకాలంలో నడి వేసవిలో మాదిరిగా 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

నేడు ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ సమాచారం :

ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఇవాళ(శనివారం) కూడా ఇలాగే ఎండలు మండిపోతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల, ఏలూరు, ఎన్టీఆర్, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో పాటు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుందని... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహన సంస్థ హెచ్చరించింది.

మరో నాలుగైదు రోజులు ఇలాగే ఎండలు కాస్తాయని... జూన్ 10 తర్వాత పరిస్థితి మారే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ఏర్పడి నైరుతి రుతుపవనాలు మళ్లీ యాక్టివ్ గా మారేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందట. దీంతో వర్షాలు ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అప్పటివరకు చెదుమదురు జల్లులు మినహా వర్షాలు కురిసే అవకాశం లేదని.. గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని  తెలిపారు.

నేడు తెలంగాణ వాతావరణ సమాచారం :

తెలంగాణలో కూడా అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వాతావరణమే ఉంది. అయితే సాయంత్రం సమయంలో వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ(శనివారం) కూడా ఇలాగే మధ్యాహ్నం ఎండలు, సాయంత్రం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది.

నిన్న(శుక్రవారం) సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, మియాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం సాధారణంగానే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది... ఈ సమయంలో వర్షం కురిసి నీరంతా రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఇవాళ, రేపు (శని, ఆదివారం) కూడా హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో తేలికపాటి జల్లులే కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది... జూన్ సెకండ్ వీక్ లో వర్షాలు జోరందుకునే అవకాశాలున్నాయట. కాబట్టి రైతులు భారీ వర్షాలు కురిసే సమయంలోనే వ్యవసాయ పనులు ప్రారంభిస్తే మంచింది. ఈ వర్షాకాలంలో పుష్కలంగా వానలు పడతాయని ఇప్పటికే ఐఎండి ప్రకటించింది... కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు... కాస్త ఆలస్యమైనా వ్యవసాయ పనులకు అనుకూల వాతావరణ ఏర్పడుతుంది.