ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో కంగారుపడుతున్న తెలుగు రైతులకు వాతావరణ విభాగం గుడ్ న్యూస్ తెలిపింది. మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో తిరిగి వర్షాలు ప్రారంభం అవుతాయని తెలిపారు.
Telangana and Andhra Pradesh Weather Updates : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులున్నాయి. ఎండాకాలమంతా వర్షాలు కురియగా ఇప్పుడు వర్షకాలంలో ఎండలు మండిపోతున్నాయి. నడి వేసవిలో మాదిరిగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
నైరుతి రుతుపవనాలు ముందుగానే భారతదేశాన్ని తాకాయి... దీంతో గత నెల (మే) చివర్లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసాయి. ఇవి ఇలాగే కొనసాగుతాయని భావించిన రైతులు భూములను సిద్దం చేసుకుని వర్షాధార పంటల సాగుకు సిద్దమయ్యారు. కొందరు రైతులు ఇప్పటికే విత్తనాలు కూడా విత్తుకున్నారు. ఈ సమయంలో వర్షాలు ముఖం చాటేయడంతో అన్నదాతలు కంగారు పడుతున్నారు.
అయితే రైతులు ఆందోళనకు గురికావద్దని.. జూన్ 10 తర్వాత మళ్లీ వర్షాలు మొదలవుతాయని భారత వాతావరణ శాఖ (IMD) సూచించింది. వాతావరణ పరిస్థితుల కారణంగా రుతుపవనాలు కదలికలు మందగించాయని.. అందువల్లే వర్షాలు కురవడం లేదట... మరో నాలుగైదురోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. జూన్ 10 తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చి రుతుపవనాలు చురుగ్గా మారతాయని... దీంతో వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
నేడు తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుందంటే :
నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే జోరువానలు కురియాలి... రుతుపవనాలు ఇప్పుడే ప్రవేశించి విస్తరించాల్సింది. కానీ ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో మే చివర్లోనే తొలకరి జల్లులు కురిసాయి. భారీ వర్షాలు కురవడంతో నదులు, వాగులు వంకలు వరదనీటితో ఉప్పొంగాయి.. చెరువులు, ప్రాజెక్టుల్లోకి కూడా నీరు చేరింది. దీంతో ఇలాగే వర్షాలు కొనసాగుతాయని భావించి తెలంగాణలోని కొందరు రైతులు వర్షాధార పంటలు వేసారు. కానీ ఇప్పుడు వర్షాలు కురవకుండా ఎండలు మండిపోతుండటంతో ఆ రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇవాళ(శుక్రవారం) తూర్పు, దక్షిణ తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా వికారాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయని... మిగతా జిల్లాల్లో కూడా వేడి వాతావరణమే ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆకాశం మేఘాలతో కప్పేసి వాతావరణ చల్లగానే ఉన్న ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
తెలంగాణలో అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి... కాబట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షం కురిసే సమయంలో చెట్లకింద ఉండటం మంచిదికాదని... సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. వర్షాలు మొదలయ్యాకే విత్తనాలు విత్తుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.
నేడు ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం ఎలా ఉంటుందంటే :
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వేడి వాతావరణమే ఉంది... సాధారణంగా జూన్ లో ఉండే వాతావరణ పరిస్ధితులు ప్రస్తుతం లేవు. వానల స్థానంలో ఎండలు ఉన్నాయి. ఈ రెండ్రోజులు పగటి ఉష్ణోగ్రతలు మరో 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 10 తర్వాత వాతావరణ పరిస్ధితుల్లో మార్పు వచ్చి మళ్లీ వర్షాలు మొదలవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నేడు(శుక్రవారం) వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మధ్యాహ్నం సమయంలో విశాఖపట్నం పరిసరాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందట. మిగతా ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు కురుస్తాయని... దీంతో ఎండల నుండి ఉపశమనం లభించినా ఉక్కపోత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
విజయనగరం , అల్లూరి, ఏలూరు, ఎన్టిఆర్, నంద్యాల జిల్లాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని... ఎండాకాలంలో మాదిరిగా 39-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నరసాపురంలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.