అమరావతి: సస్పెన్షన్ కు గురైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలియదు గానీ ఆ వార్తాకథనంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు ఉన్నాయి. 

టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నేతల ఫోన్ కాల్స్ ను ట్యాపింగ్ చేయడానికి కుట్ర జరిగిందని, ఏబీ వెంకటేశ్వర రావుతో కలిసి చంద్రబాబు 2017లోనే కుట్ర చేశారని ఆ వార్తాకథనం తెలియజేస్తోంది. అందుకుగాను ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ఆ వార్తాకథనం తెలియజేస్తోంది. 

also Read: ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపు: జగన్‌కు బాబు హితవు

సాక్షి వార్తాకథనం ప్రకారం.... క్రిటికల్ ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ పరికరాలకు భారీ నిధులు వెచ్చిస్తూ ఇజ్రాయెల్ లోని రక్షణ ఉత్పత్తుల ప్రైవేట్ కంపెనీ ఆర్టీ ఇన్ ప్లేటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలును ప్రతిపాదించారు. రక్షణ ఉత్పత్తులను విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలంటే రక్షణ శాఖ అనుమతి తీసుకోవాలి. కానీ ఆ నిబంధనను పాటించలేదు. దాంతో దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ప్రోసీజర్స్ ను విదేశీ కంపెనీలకు లీక్ చేసినట్లు అయిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలంటున్నాయి. 

ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు కాంట్రాక్టును తన కుమారుడి కంపెనీకి కట్టబెట్టే విధంగా ఏబీ వెంకటేశ్వర రావు కథ నడిపారు. ఇందులో భాగంగా భారతదేశంలోని ఫ్రాంచైజీగా ఆకాశం అడ్వాన్డ్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ ఏబీ వెంకటేశ్వర రావు కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందింది. సాయి కృష్ణ ఆ కంపెనీ సీఈవో. విజయవాడ క్రీస్తు రాజపురం ఫిల్మ్ కాలనీలో ఓ అపార్టుమెంటు ఫ్లాట్ చిరునామాతో ఆ కంపెనీని నెలకొల్పారు. ఆ కాంట్రాక్టుకు సంబంధించిన పర్చేజ్ ఆర్డర్ ను రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఉద్దేశ్యపూర్వకంగా మాయం చేశారు. 

Also Read: మానసికంగా ఇబ్బంది లేదు, చట్టపరమైన చర్యలు: ఏబీ వెంకటేశ్వరరావు

ఏబీ వెంకటేశ్వర రావు వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సీరియస్ గా ఉన్నట్లు కూడా సాక్షి దినపత్రిక రాసింది. ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ సమంజసమేనని కేంద్ర హోం శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయంటూ ఆ వార్తాకథనం తెలియజేస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ వర్గాలు సూచిస్తున్నట్లు తెలిపింది.

ఏబీ వెంకటేశ్వర రావును సస్పెండ్ చేయడాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఏబీ వెంకటేశ్వర రావుపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆయన అన్నారు. తాను ఏ విధమైన అక్రమాలకు కూడా పాల్పడలేదని ఏబీ వెంకటేశ్వర రావు కూడా చెప్పారు. సస్పెన్షన్ ను చట్టపరంగా ఎదుర్కుంటానని ఆయన చెప్పారు.