ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపు: జగన్‌కు బాబు హితవు
ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం నాడు స్పందించారు.
అమరావతి: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై కక్షసాధింపు చర్యలు మంచివి కావని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు. అధికారులకు జీతాలు, పోస్టింగులు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగార్జున యూనివర్శిటీకి చెందిన విద్యార్థులను చంద్రబాబునాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సోమవారం నాడు పరామర్శించారు.ఈ సందర్భంగా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.
40 ఏళ్లలో తాను ఇలాంటి పాలనను ఏనాడూ కూడ చూడలేదని చంద్రబాబునాయుడు చెప్పారు. సీఎం చెప్పిన పనిని చేయడమే అధికారుల విధి అని
ఆయన చెప్పారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సస్పెండ్ చేయడం దారుణమన్నారు. అర్ధరాత్రి జీవోలు ఇవ్వడం, ఐటీ దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమన్నారు.
తెల్ల రేషన్ కార్డుదారులు కలిగి ఉన్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆయన చంద్రబాబు విమర్శించారు. రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేస్తే కేసులు పెడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
విద్యుత్ ఛార్జీలతో పాటు అన్ని రకాల ధరలను పెంచుతారని జగన్ ప్రభుత్వంపై ఆయన సెటైర్లు వేశారు. చేతగాని పాలనను సాగిస్తున్నారని జగన్ పై విమర్శలు గుప్పించారు. మూడు రాజధానులు ఎవరు కోరారో చెప్పాలన్నారు.
నాగార్జున యూనివర్సిటీ లో విద్యార్థులపై దాడులు చేయడం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తుంటే దాడులు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. నాగార్జున యూనివర్శిటీ వైస్ చాన్సిలర్ ప్రవర్తన దారుణంగా ఉందని ఆయన విమర్శలు చేశారు.
తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే విద్యార్థులపై దాడులకు పాల్పడుతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. వీసీ సమక్షంలోనే విద్యార్థులపై దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు.
Also read: ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలపై కేంద్ర సంస్థతో దర్యాప్తు: ఆ 7 అభియోగాలు ఇవే
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వీసీ ఒక్క పార్టీకి ఎలా వత్తాసు పలుకుతారని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తోంటే విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని యూనివర్శిటీ వీసీపై బాబు మండిపడ్డారు.
యూనివర్శిటీలో జగన్ ఫోటోతో ఊరేగింపు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్వార్థ రాజకీయాల కోసం యూనివర్శిటీని వాడుకొంటున్నారన్నారు. జగన్ సైకో.. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఆయనకే తెలియదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ జాతీయ పత్రిక నిర్వహించిన సర్వేలో 86 శాతం ప్రజలు రాజధాని తరలింపును తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన చెప్పారు.
సీఎం ఆలోచనలను ప్రజలపై రుద్దే అధికారం యూనివర్శిటీ వీసీకి ఎవరు ిచ్చారని ఆయన ప్రశ్నించారు. వీసీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.
సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రజలు కోరుకొంటున్నారని ఆయన చెప్పారు. వీసీ అక్రమాల చిట్టా తమ వద్ద ఉందన్నారాయన.
విద్యార్థులకు అమరావతి జేఎసీ మద్దతుగా నిలుస్తోందని చెప్పారు. యూనివర్శిటీలో జరిగిన ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా సీపీఐ సెక్రటరీ రామకృష్ణ చెప్పారు.